హైదరాబాద్: సోషల్ మీడియాలో ఈ మధ్య ఫేక్ అకౌంట్స్ పెరిగిపోతున్నాయి. సైబర్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా కూడా కొందరు కేటుగాళ్లు వారికి దొరకకుండా తమ ఆగడాల్ని కొనసాగిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలతో పాటు సామాన్యుల సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్‌ను క్రియేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కేటుగాళ్లు రాజకీయ నాయకులను కూడా వదలడం లేదు. తాజాగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి పేరు మీద సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేశారు. ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి పేరు మీద అమ్మాయిల ఫోటోలతో ఒక ఫేస్‌బుక్ ఐడి సృష్టించారు.
అయితే ఈ విషయం జగ్గారెడ్డికి తెలియడంతో వెంటనే ఆయన అలెర్ట్ అఇ తన అనుచరులను అప్రమత్తం చేశారు. తన పేరు మీద కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని జగ్గారెడ్డి తన అనుచరగణానికి తెలిపారు. అలాగే ఆ ఫేక్ అకౌంట్‌లో అమ్మాయిల ఫోటోలను అప్‌లోడ్ చేశారని పేర్కొన్నారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు కొందరు కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఫేస్‌బుక్ ఐడి క్రియేట్ చేయడంపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేస్తానని జగ్గారెడ్డి పేర్కొనారు. తన పేరు మీద కొత్తగా ఫేస్‌బుక్‌లో క్రియెట్ అయిన ఐడి తనది కాదని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.