సంగారెడ్డి కాంగ్రెస్ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి
సమైక్యవాదంతో ముందుకొస్తే
కెసిఆర్‌కు మద్దతు : జగ్గారెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం కెసిఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలోనూ తాను సమైక్యవాదాన్నే వినిపించానని ఆయన గుర్తుచేశారు. అందరూ తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎంఎల్‌ఎగా గెలిచానని, సమైక్యం తన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీకి సంబంధం లేదని జగ్గారెడ్డి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యవాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఈ అంశంలో టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అభిప్రాయం వేరు, తన వ్యక్తిగత అభిప్రాయం వేరని జగ్గారెడ్డి స్పష్టీకరించారు. ప్రజల ఆలోచన మేరకే ముందుకెళ్తానని, ఏ ప్రాంతానికి తాను వ్యతిరేకం కాదని ఆయన వెల్లడించారు. ఇది ప్రజల డిమాండ్ కాదని, నాయకుల అభిప్రాయం మాత్రమేనని జగ్గారెడ్డి తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడారని, నీళ్లు.. నిధులు.. నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని, కానీ, ప్రజల ఆ కాంక్షలు నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని, విభజన జరిగినా ఆంధ్ర ప్రజలు కోటి మంది కి పైగా తెలంగాణలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు తనను తప్పుబట్టిన వారు ఇప్పుడు సమైక్యానికి మద్దతు పలుకుతున్నారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. ఎపిలో పార్టీ పెట్టమని కోరుతున్నారని సిఎం కెసిఆర్ అన్నారని, పార్టీ పెట్టడం ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేద్దాం అని ఎపి మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారని ఆయన గుర్తుచేశారు. సమైక్యం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి అని జగ్గారెడ్డి తెలిపారు.