Sunday, November 17, 2024

ఎమ్మెల్సీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు

- Advertisement -
- Advertisement -

తలకొండపల్లి: బిఆర్‌ఎస్‌లో అమాత్యుల మధ్య ముసలం ముదురుతోంది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా సభలు, సమావేశాలకు ఎలా హాజరవుతారని బిఆర్‌ఎస్‌లోని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ వర్గీయులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని నిలదీశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారంటూ దాడి చేసేంత వరకు వచ్చారు. దీంతో వెంటనే తేరుకున్న ఎమ్మెల్సీ సెక్యూరిటీ రక్షణ కవచంగా ఏర్పడడంతో ఎమ్మెల్సీకి పెను ప్రమాదం తప్పింది. తలకొండపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్నలు హాజరయ్యారు.

అయితే ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా మీరు ఎలా వస్తారని? ఎమ్మెల్యేను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదా? అంటూ ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టి అదుపు చేశారు. బిఆర్‌ఎస్‌లోని అమాత్యుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమనడం చర్చనీయాంశంగా మారింది.
గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభం..
తలకొండపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్నలు స్థానిక సర్పంచ్ లలితాజ్యోతయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషకరమన్నారు. రూ.40లక్షలతో అన్ని వసతులతో గ్రామ పంచాయతీని నిర్మించడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ నిర్మాణంకోసం ఎమ్మెల్సీ నిధులు రూ.5లక్షలను వెచ్చించడం జరిగిందన్నారు. తలకొండపల్లి మండల అభివృద్ధికోసం ఎల్లప్పుడు ముందుంటానన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను భయపడేదిలేదని, అభివృద్ధిమాత్రం ఆపేదిలేదన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తలకొండపల్లి మండలంలో నిర్మించిన గ్రామ పంచాయతీకి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టడం రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామ పంచాయ తీ అన్నారు. అదేవిధంగా ఎంపిపి నిర్మలాశ్రీశైలంగౌడ్, జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ.. తమ ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవకు అంకితం అవుతామన్నారు. అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినవారిని అడ్డుకోవాలని చూడడం మూర్ఖత్వమన్నారు. గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు ఆహ్వాన పత్రిక అందించినప్పటికీ ఎమ్మెల్యే రాలేదని, వచ్చినవారిని కనీస మర్యాదలేకుండా దాడులు చేసేందుకు యత్నించడం ఎమ్మెల్యే వర్గీయుల గుండా గిరికి నిదర్శనమన్నారు.

ప్రశాంతమైన వాతావరణాన్ని చెదరగొట్టేలా వ్యవహరించడం సరికాదన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్సీ, జడ్పిటిసిలు నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మ అనిల్, ఎంపిటిసి హేమరాజు, ఎంపిడిఒ శ్రీకాంత్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News