Friday, December 20, 2024

ఆర్మూర్ అభివృద్ధిలో వెనక్కి తగ్గెదెలే: ఎంఎల్ఏ జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్ ః ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ సమీకృత వెజ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్మూర్ ఎంఎల్ఏ జీవన్‌రెడ్డి ప్రకటించారు. నమస్తే అంకాపూర్ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్ఏ జీవన్‌రెడ్డి శనివారం ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం అంకాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. స్థానిక ప్రజలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో జీవన్‌రెడ్డిని సన్మానించారు. జై జీవనన్న, జైజై కెసిఆర్, దేశ్ కీనేత కెసిఆర్, జై తెలంగాణ వంటి నినాదాలతో అంకాపూర్ గ్రామం మారుమోగింది. ఆయన గ్రామమంతా కలియ తిరిగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు.

అన్ని వీధుల్లో ప్రజలతో మాట్లాడుతూ మిషన్ భగీరథ మంచినీళ్లు వస్తున్నాయా? పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా? మీ గ్రామంలో ఇంకా సమస్యలేమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్ కూరగాయల ఎగుమతులకు ప్రసిద్ది చెందిందన్నారు. ఇక్కడి నుంచి నాగపూర్ , ముంబై, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు నిత్యం కూరగాయాల ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. అంకాపూర్ నుంచి కూరగాయల ఎగుమతులను మరింత ప్రోత్సహించడం కోసం సిఎం కెసిఆర్‌తో మాట్లాడి త్వరలోనే సమీకృత మార్కెట్‌ను నిర్మిస్తామని జీవన్‌రెడ్డి ప్రకటించారు. అంకాపూర్ అభివృద్ధి పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన అంకాపూర్‌కు డబుల్ రోడ్డు ఇప్పటికే మంజూరు అయిందని, త్వరలో డాంబర్ రోడ్డు వేసి 1.5 కోట్ల రూపాయలతో డివైడర్ నిర్మిస్తామని ఈ రోడ్డు పొడవునా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంకాపూర్ గ్రామంలో గాంధీ చౌరస్తా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అందంగా ముస్తాబు చేస్తామన్నారు. జాతీయ రహదారిపై ఎక్కువ మూల మలుపులు ఉన్నందున ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించడానికి నేరుగా డబుల్ వైండింగ్ రోడ్డు వేయాలని అంకాపూర్ గ్రామస్తులు కోరుతున్నారన్నారని ఆయన చెబుతూ ఈ డబుల్ రోడ్డును కూడా మంజూరు చేస్తామన్నారు. ఆర్మూర్ నియోజక వర్గంలో 50 నుంచి 60 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే రెన్యూవల్స్, వైండింగ్ పనుల ప్రతిపాదనలు వచ్చాయని, వీటి గురించి సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తుతామని ఆయన చెప్పారు.

అంకాపూర్ గ్రామానికి గతంలో సిఎం కెసిఆర్ ప్రకటించిన పనులు చాలా వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులుత్వరలోనే పూర్తి చేస్తామని జీవన్‌రెడ్డి హామీనిచ్చారు. అంకాపూర్‌లో చేపట్టిన 165 డబుల బెడ్ రూం ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరిందని, వచ్చే జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ గృహ ప్రవేశాలు ఉంటాయని జీవన్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఈ ఇండ్లకు సంబంధించి 85 మంది లబ్దిదారుల ఎంపిక పూర్తయిందని, మిగిలిన లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపిస్తామని ఆయన అన్నారు. మండల యాదవ సంఘం భవనానికి కాపౌండ్ వాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానన్నారు.

ఆర్మూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా, ప్రజల అభీష్టం మేరకు కొత్తగా ఆలూరు, డొంకేశ్వర్ మండలాలు సాధించా. ఆర్మూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయించా. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాను సుందరీకరించా. సిద్దుల గుట్టకు రూ. 20 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మించా, ఆర్మూర్ నిజామాబాద్, ఆర్మూర్ ఆలూరు ఇలా దాదాపు 9 బైపాస్ రోడ్లు వేయించా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతో మంచినీళ్లు ఇస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా 200కు పైగా చెరువులు బాగు చేసుకున్నాం. నిరంతరం ప్రజల మధ్చే ఉంటా, ఆర్మూర్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

తనతో పాటు నమస్తే అంకాపూర్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల అదికారులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ సామాజిక వర్గాల సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ కిషోర్, ఎంపిటిసి మహేందర్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ నితీష్, పార్టీ స్థానిక నాయకులు ఎంసి గంగారెడ్డి, నరసారెడ్డి, యాదవ సంఘం మండలాధ్యక్షుడు భాజన్న, వీడీసీ సభ్యులు వివిధ కుల సంఘాల ప్రతినిధులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News