స్టేషన్ ఘన్‌పూర్: గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని కాంగ్రెస్ మెనిఫెస్టో చదివినట్లు ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధికి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ మెనిఫెస్టో చదివినట్టుగా ఉందన్నారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని విస్మరించారని, తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారన్నారు.
నీతి అయోగ్ ప్రశంసలు, కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్, ఐటీ ఎగుమతుల్లో సాధించిన ప్రగతిని గవర్నర్ చెప్పడం మర్చిపోయారన్నారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదన్నారు. ఆమె స్థాయికి తగదన్నారు. గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారని, 2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని, దళిత బంధు ప్రస్తావన లేదని, రైతుల పంటలకు బోనస్ గురించి మాట్లాడలేదన్నారు.