మనతెలంగాణ/హైదరాబాద్ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి చారిత్రాత్మక తీర్పు చెప్పిన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ శుక్రవారం పదవీ విరమణ చేసి, శనివారం జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన్ను ఢిల్లీలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పక్షాన కృతజ్ఞతలు తెలియచేశారు. జస్టిస్ రమణ మీడియా అకాడమీ చైర్మన్‌ను, జర్నలిస్టు నాయకులను అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘కొలిమి అంటుకున్నది’ పుస్తకం గురించి ప్రస్థావించిన జస్టిస్ రమణ మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణతో ప్రత్యేకంగా మాట్లాడారు. జస్టిస్ రమణను కలిసిన వారిలో టియూడబ్లుజే ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, సొసైటీ ప్రధాన కార్యదర్శి వంశీ, ఢిల్లీ టియూడబ్లుజే అధ్యక్షుడు వెంకట్, ఢిల్లీ సీనియర్ జర్నలిస్ట్‌లు అరుణ్, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.