Monday, December 23, 2024

 అస్థిత్వమే కాదు… ఆస్తులు సృష్టించాం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పాలనలో రూ.50లక్షల కోట్ల సంపద సృష్టి

తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా బిఆర్‌ఎస్ పాలనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక, అబద్ధాల పుట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. అదొక అంకెల గారడీ, అభాండాల చిట్టా అని విమర్శించారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీ వేదికగా తాను, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలు ధీటుగా సమాధానం చెప్పామని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో గత తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ తెలంగాణ భవన్‌లో ఆదివారం ‘స్వేదపత్రం’ పేరిట కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో తమపై బురద జల్లే ప్రయత్నం చేసిందని, ప్రజలకు అసలైన నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ‘స్వేదపత్రం’ విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు పేరుతో హడావుడి చేసి ఆఖరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిన విషయాన్ని అందరూ చూశారని కెటిఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చివరకి వాయిదా వేసుకొని పోయారని, బాధ్యతగల పార్టీగా తమకు పదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్ధేశంతోనే తాము ‘స్వేద పత్రం’ విడుదల చేస్తున్నామని చెప్పారు. పదేళ్లు చమటోడ్చి, రక్తాన్ని రంగరించి.. వందల, వేల గంటలు పనిచేసి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామని తెలిపారు. తమ ప్రభుత్వంలోని మంత్రులు, ఎంఎల్‌ఎలు, సిఎం మాత్రమే కాదు.. లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడ్డారో.. ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో చెప్పాల్సిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా వివరిస్తున్నామని అన్నారు.

కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ఈ స్వేదపత్రం అని వ్యాఖ్యానించారు. రైతులు, పాడి రైతుల స్వేదంతో సృష్టించిన సంపదను శ్వేతపత్రంలో ఎందుకు చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మత్స్యకారులు, గొర్రెల కాపరులు సృష్టించిన సంపదను ఎందుకు చెప్పలేదని కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

బిఆర్‌ఎస్ పాలనలో రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టి
తెలంగాణ ఆకాశమంత ఎత్తులో అగ్ర రాష్ట్రంగా ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి అస్థిత్వమే కాదు.. ఆస్తులు కూడా సృష్టించామని వ్యాఖ్యానించారు. తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో సుమారు రూ.50 లక్షల కోట్లపైనే సంపద సృష్టించామని కెటిఆర్ వెల్లడించారు. పెట్టిన ఖర్చు కన్నా పదుల రెట్లు ఎక్కువ ఆస్తులు, సంపద సృష్టించామని చెప్పారు. “అప్పు కాదు…ఖర్చు కాదు..ఇది పెట్టుబడి….సంపద సృష్టి..రాష్ట్ర సంపద” అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. “తెలంగాణ దేశానికే దీపస్తంభం…ఆరిపోనివ్వం…ఆగిపోనివ్వం..ప్రజల పక్షాన నిలబడతాం” అంటూ ఉద్ఘాటించారు.

సాగునీరు, గ్రామాల అభివృద్ధి వల్ల భూముల విలువ భారీగా పెరిగిందని చెప్పారు. కోటి 52 లక్షల ఎకరాల పట్టా భూమి విలువ కనీసం ఐదు రెట్లు పెరిగిందని తెలిపారు. 60 ఏళ్లలో రూ.4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారని ఆరోపించారు. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లు అని, విద్యుత్ రంగంలో తమ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు రూ.6,87,585 కోట్లు అని వెల్లడించారు. విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచామని కెటిఆర్ అన్నారు.

విధ్వంసం నుంచి వికాసం వైపు
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి సమృద్ధి వైపు తెలంగాణ అడుగులు వేసిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.ఎక్కడికి చేరుకున్నమో తెలియాలి అంటే.. ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి అంటారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొందని, ఎన్నో పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని చెప్పారు. కొత్త రాష్ట్రంలో గత పదేళ్ల ప్రగతి ప్రస్థానం భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయమని వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు… ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం అప్పటి పాలకులు చేశారని అన్నారు.

అది కాంగ్రెస్ పాలకులు కావొచ్చు…ఇతరులు కావొచ్చు.. వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం.. పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ అని పేర్కొన్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రేమ్ అమన్ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది “తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్‌” పేరుతో ఆయన రూపొందించిన డాక్యుమెంటరీని ఈ సందర్భంగా కెటిఆర్ వేదికపై ప్రదర్శించారు. ఆ డాక్యుమెంటరీని చూస్తే చూస్తే కళ్లకు కట్టినట్లు అర్థమవుతుందని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు కొందరు నేతలు తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారని, ఎన్నో పోరాటాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటయ్యిందని అన్నారు. ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు, పేలిన బుల్లెట్లకు లెక్కలేదని చెప్పారు.

తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, తమ ప్రభుత్వాన్ని స్థిరంగా ఉండనీయకుండా చేసేందుకు కొందరు ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేసి ప్రముఖ ఆర్థిక నిపుణులు జిఆర్ రెడ్డిని, ఉన్నతాధికారి నర్సింగ్‌రావులను రాష్ట్రానికి తీసుకువచ్చి వారి సేవలు వినియోగించుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ప్రాధమ్యాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతిబాట పట్టించామని కెటిఆర్ ఉద్ఘాటించారు. సంక్షేమం, విద్యుత్, వ్యవసాయం ఇలా ప్రాధమ్యాలు నిర్దేశించుకున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికలు కాదు…రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేశామని తెలిపారు.

గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపించారు
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలను, గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపించిందని కెటిఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న రుణాలు రూ.3.17,051 కోట్లు మాత్రమే, లేని అప్పును ఉన్నట్లుగా చూపి తిమ్మిని బమ్మిని చేస్తున్నారని విమర్శించారు. తమ మీద బట్టకాల్చి వేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్‌టిసి, విద్యుత్, పౌరసరఫరాల శాఖల్లో లేని అప్పు ఉన్నట్లు చూపిస్తున్నారన్నారు. రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్లు కాగా.. దీన్ని కాంగ్రెస్ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రంలో చెప్పిన ప్రకారం ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి లోపల తెలంగాణ అప్పులు రూ.3,89,673 కోట్లు అని, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిపోయిన అప్పులు రూ.72,658 కోట్లు అని పేర్కొన్నారు. స్థూలంగా తమ ప్రభుత్వం తెచ్చిన అప్పులు 3,17,015 కోట్లు మాత్రమే అని, ఈ అప్పును వాళ్లు రూ.6.71 లక్షల కోట్లుగా చూపించారని అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ గ్యారంటీ ఉన్న ఎస్‌పివి అప్పులు రూ.1,27,208 కోట్లు కాగా, ఎస్‌పివి రుణాలు రూ.1,18,557 కోట్లు అని చెప్పారు. ప్రభుత్వ హామీ లేని రుణాలు మరో రూ.59,414 కోట్లు అని, అయితే ఈ మూడు రకాల రుణాలు ప్రభుత్వ అప్పులు కావు.. కానీ, కొత్త ప్రభుత్వం మాత్రం తాము తెచ్చిన రూ.3,17,015 కోట్ల అప్పులకు ఈ మూడు రకాల అప్పులను కూడా జతచేసి బిఆర్‌ఎస్ ప్రభుత్వం మొత్తం రూ.6,71,757 కోట్ల అప్పులు చేసినట్లుగా చూపించిందని వివరించారు. కానీ, తాము దిగిపోయే నాటికి ఉన్న అప్పు మాత్రం కేవలం రూ.3,17,015 కోట్లు మాత్రమే అని, ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్లుగా చెప్పడం శుద్ధ అబద్ధం అని పేర్కొన్నారు.

రావాల్సిన డబ్బులను అప్పుగా చూపించారు
పౌర సరఫరాల సంస్థకు ఇప్పటివరకు ఉన్న అప్పు రూ.21,029 కోట్లు మాత్రమే, కానీ నిల్వలు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని చూపారని కెటిఆర్ వివరించారు. ప్రభుత్వం చూపించిన లెక్కలు తప్పుల తడకలుగా ఉన్నాయని చెప్పడానికి సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అప్పులను ఉదాహరణగా తీసుకుని వివరించారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్లో రూ.56 వేల కోట్ల అప్పు ఉందని శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పిందని, అది పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. వాస్తవానికి సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్‌లో దాదాపు రూ.30 వేల కోట్ల విలువచేసే ధాన్యం ఉందని, ఆ ధాన్యం అమ్మితే రూ.30 వేల కోట్లు వస్తాయని చెప్పారు.

అమ్మిన ధాన్యానికి రావాల్సిన నిధులు రూ.16 వేల కోట్లు ఉన్నాయని, ఉన్న ధాన్యం విలువను, అమ్మిన ధాన్యానికి రావాల్సిన నిధులను లెక్కలోకి తీసుకోకుండా సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు రూ.56 వేల కోట్లు అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నదని, ఇది చాలా దారుణమని అన్నారు. కొత్త ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతున్నదనడానికి ఇదో గొప్ప ఉదాహరణ కెటిఆర్ విమర్శించారు.

రైతుబీమా వచ్చిన వారిలో 99.9 శాతం సహజ మరణాలే
తెలంగాణాలో ఒక్క ఫ్లోరైడ్ ప్రాంతం కూడా లేదని కేంద్రమే చెప్పిందని కెటిఆర్ గుర్తు చేశారు. అందుకు పెట్టిన ఖర్చు నిరర్ధకం అంటారా..? అని ప్రశ్నించారు. రైతుల సహజ మరణాలకు కూడా రైతు బీమా వస్తుందని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో 1,11,320 కుటుంబాలకు రైతు బీమా సొమ్ము అందిందని, 1,11,320 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సిఎం అంటున్నారని వాపోయారు. రైతుబీమా వచ్చిన వారిలో 99.9 శాతం సహజమరణాలే అని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని… ఇదీ వాళ్ల పరిజ్ఞానం.. తెలివితేటలు అని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కెటిఆర్ పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ హయాంలో పేదరికం బాగా తగ్గింది
తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో పేదరికం బాగా తగ్గిందని కెటిఆర్ చెప్పారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాల ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 21.92 శాతం పేదరికం ఉండగా, తాము దిగిపోయే నాటికి కేవలం 5.8 శాతానికి చేరిందని తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలో ఇంత వేగంగా పేదరికం తగ్గలేదని అన్నారు. ఇలా అన్ని విషయాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకు బృందాలను పంపాయని, వాళ్ల రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశాయని తెలిపారు.

ప్రతి గెలుపులో పాఠాలుంటాయ్.. ఓటమిలో గుణపాఠాలుంటాయ్
ప్రతి గెలుపులో పాఠాలుంటాయని.. ఓటమిలో గుణపాఠాలుంటాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ‘స్వేదపత్రం’ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు కెటిఆర్ సమాధానం ఇచ్చారు. ఓటమిలో చాలా అంశాలు ఉన్నాయని అన్నారు. ఒకటి రెండు అని చెప్పను గానీ.. భారతదేశంలో ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చాం…కానీ,ఆ విషయాన్ని అంతగా ప్రచారం చేసుకోలేకపోయాం…అలాగే అత్యధికంగా భారతదేశంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. కానీ, చెప్పుకోలేకపోయాయని అన్నారు.

‘నిజం గడప దాటేలోపల.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది’ పెద్దలు సామత చెబుతుంటారని, తమ విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పారు. యూట్యూట్‌లలో కొందరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయాయమని, తద్వారా కొంత నష్టం జరిగిందని అన్నారు.యువత దుష్ప్రచారాన్ని నమ్మినట్టు అనిపించిందని, దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత తమ మీదున్నదని అన్నారు. ఆ రోజే స్పందించి ఉంటే బాగుండే అని అభిప్రాయం ఉందని పేర్కొన్నారు.

అపజయం కాదు.. స్పీడ్ బ్రేకర్ మాత్రమే..
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కేవలం 1.85 శాతం ఓట్లతోనే ఓడిపోయిందని, అందులో ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల మెజారిటీతో పోయాయని కెటిఆర్ తెలిపారు. కాబట్టి తమకు ఇది ఘోర అపజయం కాదు అని, ఇది కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అలవికాని వాగ్ధానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేసి విజయవంతం కావాలనే తాము కోరుకుంటున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరారు. వందరోజుల్లో చాలా చేస్తామని చెప్పారు… వందరోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.. తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అని చెప్పారు.

నిరుద్యోగ భృతిపై అప్పుడే నాలుక మడతేశారు
కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు నిరుద్యోగ భృతిపై అప్పుడే నాలుక మడతేశారని కెటిఆర్ విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మ్యానిఫెస్టోలో పెట్టి.. మొన్న ఉప ముఖ్యమంత్రి తాము అనలేదనే అన్నారని చెప్పారు. ఈ విషయంలో అప్పుడే నాలుక మడతేశారని ఎద్దేవా చేశారు. ఇట్ల ఎన్నో అంశాలున్నాయ్.. ఆరు గ్యారెంటీలు కాదు..412 హామీలున్నాయని, వాటిని లెక్కదీశామని అన్నారు. హామీల అమలుపై తమ పార్టీ తరఫున షాడో టీమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిపార్ట్‌మెంట్ల వారీగా షాడో టీంను ఏర్పాటు చేసి, హామీల అమలును పర్యవేక్షిస్తామని అన్నారు. తప్పకుండా ప్రతిశాఖలో, ప్రతిరంగంలో ప్రభుత్వ పనితీరును, తీసుకునే ఏయే నిర్ణయాలను నిశితంగా గమనించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

పోటీకి వెళ్లిన ప్రతిసారీ గెలుస్తమే విశ్వాసం ఉండేది..
రాజకీయాల్లో పోటీకి వెళ్లిన ప్రతీసారి గెలుస్తమనే ఆశిస్తామని కెటిఆర్ తెలిపారు. తమకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామే విశ్వాసం ఉండేదని,అయితే ఫలితాలు తమను నిరాశ పరిచినా బాధ లేదు అని చెప్పారు. ఎందుకంటే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, వారి కోసం పోరాడుతాతామని స్పష్టం చేశారు.

ఏ విచారణకైనా సిద్ధమే
భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి కారణం తెలంగాణేనని కెటిఆర్ తెలిపారు. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుబడుతున్నారని, ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయకట్టు స్థిరీకరణ చేశాశామని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరిగితే సరి చేయండి… కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని హామీలను నెరవేర్చేందుకు వినియోగిస్తారా…? కక్ష్య సాధింపు కోసం వినియోగిస్తారా? అది వాళ్ల విజ్ఞత అని పేర్కొన్నారు.

ఏ విచారణ అయినా చేయమని తాము శాసససభలో డిమాండ్ చేసిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. తప్పులుంటే బయటపెట్టమనండి. అన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఏరకంగా చేసిన తమకు అభ్యంతరం లేదని, ఏ ఎంక్వైరీ అయినా.. ఏ కమిషన్ అయినా.. ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా తమ అభ్యంతరం లేదని చెప్పారు. తప్పు జరిగితే చర్య తీసుకోండి అంతేగానీ, తమపై కోపంతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చవద్దని కోరారు. ప్రపంచమంతా మనల్ని నిందించే పరిస్థితి తీసుకురాకండని అన్నారు. ఇప్పటికే 90 శాతం పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డి పనులు పూర్తి చేసి నీరు ఇవ్వండి… ఫలాలు అనుభవించండి కానీ, ప్రాజెక్టులను బద్నాం చేయొద్దని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోని మహిళలను అడిగితే మిషన్ భగీరథ గొప్పతనం చెబుతారని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News