హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల ద్వారా పేద ప్రజల సొంతింటి కల నేరవేరుతోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాధ్ అన్నారు. గురువారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కమలానగర్ ఎస్.పి.ఆర్ హిల్స్ లో రూ. 17.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ సముదాయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు సురబీ వాణిదేవి, మిర్జా రహమత్ బేగ్, రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డిలతో కలిసి మాగంటి గోపి నాధ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వాతావరణంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభంతో పాటు పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించలేని డబుల్ బెడ్ రూం ఇళ్లను అతి తక్కువ కాలంలో పూర్తి ప్రభుత్వ నిధులతో నిర్మించి పేద ప్రజలకు ఉచితంగా అందజేయడం టిఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పతనానికి నిదర్భనమన్నారు. ప్రజాసమస్యలను పరిష్కారానికి చిత్త శుద్ది ఉండాలని అలాంటి నాయకుడు మాత్రమే ప్రజల కోసం పని చేస్తారన్నారు. గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇళ్లను సబ్సిడీ ద్వారా మంజూరు చేసిన, లబ్దిదారులకు ఉన్న బకాయిలను మాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని అన్నారు. కమలానగర్ లో రెండు బ్లాక్ ల రూపంలో 7 లిఫ్ట్ లతో మొత్తం 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మించామన్నారు. ప్రతి ఇంటికి రూ.8.50 లక్షల చోప్పున మొత్తం రూ. 17.85 కోట్లు ఖ ర్చు చేసినట్లు వెల్లడించారు.
అంతేకాకుండా ఇళ్ల సముదాయం నిర్వహణ ఖర్చులకు ఇబ్బంది లేకుండా 15 షాపులు కూడా ఏర్పాటు చేశారని అన్నారు. ప్రస్తుతం 89 మంది లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేశామని, మిగతా 121 మందికి , రెవెన్యూ అధికారులు పరిశీలించి త్వరలోనే లాటరీ ద్వారా అందజేస్తారని తెలిపారు. స్థానికంగా నివాసం ఉండి ఆధార్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, రేషన్ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యత క్రమంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేస్తున్నామని తెలిపారు. దీనికి ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించనున్నమని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్, ఆర్డీఓ వసంత, జిహెచ్‌ఎంసి సి.ఇ సురేష్, ఎస్.ఇ విద్యాసాగర్, ఈఈ వెంకటదాసు, వాటర్ వరక్స్ సి.జి.ఎం ప్రభు యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదిప్య తదితరులు పాల్గొన్నారు.