Thursday, January 23, 2025

జవహర్‌నగర్‌లో వేడెక్కిన రాజకీయం

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : జవహర్‌నగర్‌లో రాజకీయం వేడెక్కింది. 20మంది బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్‌ఎ చామకూర మల్లారెడ్డికి ఝలక్ ఇచ్చారు. నగర మేయర్ మేకల కావ్యకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి తెరలేపారు. 19మంది అసమ్మతి బిఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు క్యాంపునకు తరలివెళ్లారు. ఈ సంఘటనతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడిక్కింది. కార్పొరేషన్‌లో 28 డివిజన్‌లుండగా 2020లో జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 21, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 4 గెలిచారు. అనంతరం అప్పటి మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులు బిఆర్‌ఎస్‌లో చేరారు. కాగా 16 డివిజన్ కార్పొరేటర్ విశ్రాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, 27 మంది బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లలో ప్రస్తుతం 19 మంది క్యాంపునకు తరలివెళ్లారు.

మేయర్‌గా ఎన్నికైన నాటి నుంచి కావ్య ఒంటెద్దు పోకడలకు పోవడం ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటూ కార్పొరేటర్లను అవమానానికి గురి చేస్తుండటంతో ఆమెను పదవి నుంచి దింపడానికి గత సంవత్సరం నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. నిధులు మంజూరు చేయడంలో పక్షపాత ధోరణి, మేయర్ తండ్రి అయ్యప్ప షాడో మేయర్‌గా ఉంటూ ప్రతి కార్యక్రమంలో తలదూర్చుతూ కార్పొరేటర్లపై పెత్తనం చెలాయించడం వంటి వాటిపై విసిగిపోయారు. దాంతో నాటి నుంచే మేయర్‌కు కార్పొరేటర్ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తుంది. ఈ విషయమై మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగకపోవడంతో గత సంవత్సరం జనవరిలో 20 మంది కార్పొరేటర్లు తీర్మాన పత్రంపై సంతకాలు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. కాని అప్పట్లో అవిశ్వాసానికి అవకాశం లేకపోవడంతో కార్పొరేటర్లు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయినప్పటికి కార్పొరేటర్ల పట్ల మేయర్ వైఖరి ఏమాత్రం మారకపోవడంతో మరోసారి అవిశ్వాస తీర్మానానికి తెరలేపుతూ క్యాంపుకు తరలివెళ్లారు.

జిల్లా కలెక్టర్‌ను కలిసిన కార్పొరేటర్లు
కాగా అవిశ్వాస తీర్మానానికి అవకాశం కల్పించాలంటూ ఇటీవల మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను కార్పొరేటర్లు కలిసి సమావేశం ఏర్పాటు చేయాలంటూ కోరారు. ఈ విషయమై కలెక్టర్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయానికి ఆదేశాలు రావడం దానిపై కార్పొరేటర్ల సంతకాల పరిశీలన చేయడం జరిగింది. రెండు, మూడు రోజులల్లో అవిశ్వాస తీర్మానానికి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మేయర్ పీఠంపై కన్నేసిన కార్పొరేటర్ శాంతి కోటేష్‌గౌడ్
అవిశ్వాస తీర్మానంలో నెగ్గితే తదుపరి మేయర్ అభ్యర్థిగా 18వ డివిజన్ కార్పొరేటర్ దొంతగాని శాంతికోటేష్‌గౌడ్ ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా క్యాంపునకు తీసుకెళ్లిన ఆమె మరోసారి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. క్యాంపునకు వెళ్లిన కార్పొరేటర్లు సైతం ఆమె వైపే మొగ్గు చూపుతున్నారు. అవిశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం వీరంతా కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News