తనకు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తన స్థానంలో మరో సామాజికవర్గానికి చెందిన వారిని నిలబెట్టి గెలిపిస్తానన్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌ను కలిసి కోరినట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వెల్లడించారు. తనకు కేబినెట్‌లో చోటు ఇవ్వాలని వారికి గతంలో లేఖ కూడా రాసినట్లు ఆయన గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి కేటాయించడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నేతలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆరు జిల్లాలకు చెందిన నేతలకే మంత్రి వర్గంలో చోటు కల్పించారని, అయితే మంత్రివర్గంలో తనకు చోటు దక్కక పోయినా రంగారెడ్డి జిల్లాలో ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రిపదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానని నా స్థానంలో ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారో చెబితే వారినే ఎమ్మెల్యేగా గెలిపిస్తానని మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రకటిం చారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి గుర్తు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలంటే ఇక్కడ ఎవరో ఒకరు మంత్రిగా ఉండాలని ఎమ్మెల్యే రంగారెడ్డి పేర్కొన్నారు.