రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైరయ్యారు. తీన్మార్ మల్లన్నకు ఆయన కులం గురించి మాట్లాడే హక్కు ఉంది.. కానీ, ఇతర కులాలను తిట్టే హక్కు మాత్రం లేదని మండిపడ్డారు. ఓట్లు అడిగినప్పుడు.. ఆనాడు మేము రెడ్లు అని గుర్తు లేదా? అని ప్రశ్నించారు. ఆయనకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి బయటికెళ్లి మాట్లాడుకోవచ్చని అన్నారు.
మరోవైపు, వరంగల్లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయనపై తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు రాష్ట్ర డీజీపీకి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. క్యూ న్యూస్‌లో మాట్లాడినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని.. తీన్మార్ మల్లన్న పెద్ద తీస్మార్ ఖాన్ అనుకుంటున్నాడని ఫైరయ్యారు. మా రేవంత్ రెడ్డి.. తీన్మార్ మల్లన్నకు భిక్ష పెట్టి చాలా పెద్ద తప్పు చేశారన్నారు. తక్షణమే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేయాలని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని కోరుతున్నామని చెప్పారు.