నర్సంపేట పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పలు అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ పనులకు నిధులు కేటాయించండి
మంత్రికి ఎమ్మెల్యే వినతి
హైదరాబాద్: నర్సంపేట అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో మంత్రి కెటిఆర్‌తో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నర్సంపేటలో అభివృద్ధి, చేపట్టాల్సిన పనులు, పెండింగ్ పనుల పూర్తిపై మంత్రి కెటిఆర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. నర్సంపేట పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కొత్త పనులను మంజూరు చేయడంతో పాటు పెండింగ్ పనుల పూర్తికి సహాకారం అందించాలని ఎమ్మెల్యే పెద్ది మంత్రి కెటిఆర్‌ను కోరారు. ప్రధానంగా- నర్సంపేట నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
నర్సంపేట నుంచి వరంగల్ వరకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, తద్వారా నర్సంపేటకు ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంటుందని కెటిఆర్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు మాదన్నపేట మినీట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తికి మరో 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని, ఈపట్టణానికి ప్రయాణానికి సౌకర్యార్థమై రింగ్‌రోడ్డు పూర్తి కోసం మరో 15 కిలోమీటర్లు రోడ్డు కావాలని ఆయన మంత్రిని కోరారు. మోడల్ సిటీ ప్లాన్‌లో భాగంగా 100 శాతం రోడ్ల నిర్మాణం చేపట్టే నిమిత్తం 15 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మంత్రి కెటిఆర్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నర్సంపేట పట్టణంలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష సమావేశం అధికారికంగా నిర్వహించి, మిగిలిన పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రి కెటిఆర్‌కి విజ్ఞప్తిచేశారు.