యాదాద్రి భువనగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ముకాస్తూ ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపునకు నిరసనగా మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపుతో శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లోని, బాబు జగ్జీవన్ రావు చౌరస్తా వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని రోడ్డుపై బైఠాయించారు.
సిలిండర్లను పక్కన పెట్టి కట్టెలపొయ్యిపై వంటలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు యూపీఏ ప్రభుత్వంలో రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ రేటు నేడు రూ.1,200కు చేరిందన్నారు. అప్పట్లో గ్యాస్ ధర పెంచితే ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రోడ్లపై కట్టెల పొయ్యిపై వంట చేసి ఆందోళనలు నిర్వహించారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు గ్యాస్ ధర పెంచినా ఆమె ఎందుకు స్పందించడం లేదన్ని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అచ్చేదిన్ అంటివి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ధరను పెంచి ప్రజలను చచ్చేదిన్ స్థాయికి తేస్తివి అంటూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరుపై అసహనం వ్యక్తంచేశారు.
మోదీ ప్రభుత్వం రాయితీలను ఎత్తేస్తూ ధరలను పెంచుతుందని మండిపడ్డారు. కేవలం మతంతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రజలపై పెనుభారాలను మోపటమే పనిగా పెట్టుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తాను చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకునేందుకు దేశవ్యాప్తంగా మతవిద్వేషాన్ని రెచ్చగొడుతుందని ఆరోపించారు. మూడు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరతో పాటు, కమర్షియల్ గ్యాస్ బండల ధరలను పెంచి తన నిజ స్వరూపాన్ని మరోసారి నిరూపించుకుందన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తదని స్పష్టం చేశారు. మోదీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు