భద్రాచలంః తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. పట్టణాన్ని వరదల నుంచి కాపాడతానని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నామని సిఎం ఇచ్చిన హామీకి నేటితో ఏడాది పూర్తైందని, ఇంతవరకు రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. గోదావరి కరకట్ట ఎత్తు పెంచి, కాలనీలు నిర్మిస్తామని సిఎం చెప్పారని, ఆ హామీ ఏమైంది? ఆయన ప్రశ్నించారు.
కాగా, గతేడాది గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో భద్రాచలం పట్టణంలో భారీగా వరదలు వచ్చాయి. వరదలతో ఇండ్లు కూలిపోయి, పంటలు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక విమానంలో భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులకు కొత్త ఇండ్లు నిర్మిస్తామని అందుకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రజలకు హామి ఇచ్చిన విషయం తెలిసిందే.