మార్చి 3న నోటిఫికేషన్.. 10న నామినేషన్లు.. 20న పోలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో మార్చి 29 నాటికి ఐదుగురి ఎంఎల్‌సిల పదవీకాలం ముగియనుంది. పదవీకాలం ముగిసే వారిలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికల సంఘం మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నది. మార్చి 10 నామినేషన్ల ప్రక్రియ, మార్చి 11 నామినేషన్ల పరిశీలన, మార్చి 13 నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. మార్చి 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుదని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ముఖ్యమైన తేదీలు :
ఎన్నికల నోటిఫికేషన్ జారీ : మార్చి 3
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం : మార్చి 10
నామినేషన్ల పరిశీలన : మార్చి 11
నామినేషన్ల ఉపసంహరణ : మార్చి 13
పోలింగ్: మార్చి 20
ఓట్ల లెక్కింపు : మార్చి 20
కాంగ్రెస్‌కు నాలుగు, బిఆర్‌ఎస్‌కు ఒకటి స్థానం : మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు బిఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎగ్గె మల్లేశం మాత్రం కొద్ది నెలల క్రితమే బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మీర్జా సహన్ ఎమ్‌ఐఎమ్ నుంచి ఎంఎల్‌సిలుగా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎంఎల్‌ఎల సంఖ్య బలాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లను అధికార కాంగ్రెస్, ఒక స్థానాన్ని ప్రతిపక్ష బిఆర్‌ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది.