హైదరాబాద్ ః బీజేపీలో తనకు అడుగడుగునా అన్యాయం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. తనను రాష్ట్ర కమిటీతో పాటు కేంద్ర కమిటీ కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి కావాలని అడిగిన తనను పట్టించుకోకుండా అసహనం వ్యక్తం చేసినట్లు చెప్పారు. బీజేపీలో ఫ్లోర్ లీడర్ పోస్ట్ కావాలని అడిగిన ఇవ్వలేదని, స్వయంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి తాను పార్టీలో లేనని,
రఘునందకు ఫ్లోర్ లీడర్ పోస్ట్ ఇవ్వాలని కోరినా తనను పట్టించుకోవలేదని పేర్కొన్నారు. అసలు ఫ్లోర్ లీడర్ లేకుండా అసెంబ్లీ నడుస్తుందని ప్రశ్నించారు. ఇటీవలే పార్టీలో చేరిన ఈటలకు సైతం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చోటు దక్కిందని, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్‌కు సైతం చోటు కల్పించారన్నారు. కానీ, నాకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా అమ్నేషియా పబ్కు సంబంధించిన అంశంపై తాను నాంపల్లి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తానంటే కూడా బండి సంజయ్ వద్దని వారించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.