భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారికే పదవులు ఇస్తారా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇంకా బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారా అని ప్రశ్నించారు. గులాంగిరి చేసే వారికే పోస్టులు, టిక్కెట్లు ఇవ్వడమేమిటని నిలదీశారు. పార్టీలో ఎంత ముఖ్య నాయకుడైతే మాత్రం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వారికే అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు. మిగతా పార్లమెంట్ పరిధిలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇంకెవరూ కంటికి కనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవలే రాజాసింగ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్ష పదవిని నిఖార్సయిన పార్టీ నేతలకు మాత్రమే ఇవ్వాలని కేంద్ర అధినాకయత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలతో రహస్యంగా సమావేశాలు అయ్యే వారికి ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడి కోసం పని చేసే వారికి కాకుండా పార్టీకి, కార్యకర్తల కోసం పనిచేసే వారికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుదని చేసిన వ్యాఖ్యలు బిజెపిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా జరిగి అది పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్షుడిపైనే పరోక్షంగా విమర్శల జోరు పెంచడంతో మరింత రచ్చ జరుగుతోంది.