స్టేషన్ ఘన్‌పూర్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలను స్థానిక నేతలు బేఖాతరు చేస్తున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో సిఎం సహాయ నిధి రూ. 14.36 లక్షల చెక్కులను 36 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో జరిగే ఏ రకమైన ఎన్నికలు వచ్చినప్పుడల్ల పెద్ద పెద్ద సమావేశాలకు, సభలకు తనను వాడుకుంటున్నారని, ప్రభుత్వపరంగా కార్యక్రమాలకు, సమావేశాలకు తనను పిలవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ఎంఎల్ఎ రాజయ్య తనకు సాయం చేయమని అడగడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేశానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేశానన్నారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీరు ఒక్కరే డబ్బులు తీసుకోకుండా పనిచేశారని కొనియాడారన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగే ఆత్మీయ సమావేశాలకు నాకు ఆహ్వానం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ఆదేశాలను ఎంఎల్ఎ రాజయ్య బేఖాతర్ చేశారని మండిపడ్డారు. నాకు అవకాశం ఉన్నపుడు కూడా నిజాయితీగా పని చేశానన్నారు. మొన్నటికి మొన్న సోడాషపల్లి కేటీఆర్ బహిరంగ సభలో కడియం శ్రీహరి అంటే ఏమిటో అందరికీ అర్థమైందన్నారు. ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం లేకపోతే పార్టీలో బేదాభిప్రాయులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడే ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, పోగుల సారంగపాణి, బూర్ల శంకర్, కోతి రాములుగౌడ్, స్వామినాయక్, బానోతు రాజేష్ నాయక్, కల్మకంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.