Monday, January 20, 2025

మళ్లీ మాదే అధికారం..మేమే గెలిచితీరుతాం..

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: పాలేరుల కన్నా ఎక్కువగా కష్టపడుతున్నాము.. అన్ని వర్గాలకు సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మేలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తిరిగి మేమే అధికారంలోకి వస్తామని.. ఈ రెండు నియోజకవర్గాల్లో తిరిగి మేమే గెలిచి తీరుతామని డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు డీఎస్. రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్‌లు స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోకూడా రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నది సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వమే అని ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అద్యక్షురాలు మాలోతు కవిత పేర్కోన్నారు. ఆదివారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎంఎల్ఎ బానోత్ శంకర్‌నాయక్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాలోతు కవిత మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వంగా అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు అనునిత్యం పాటు పడుతుందన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి రైతే కావడంతో వారి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కావడంతో రైతులకు అన్ని విధాలుగా మేలు చేయాలని సంకల్పించారన్నారు. చెరువుల పూడికలు తీయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడం, నాణ్యమైన నిరంతర 24 గంటల ఉచిత విద్యూత్ అందించి అండగా నిలవడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ధాన్యగారంగా మారిందన్నారు. మూడు పంటలు కూడా పండించుకుంటూ రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతులు పండించిన పంటల కొనుగోళ్లు చేసేందుకు గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడం విశేషం అన్నారు. అన్నదాతలకు బాసటగా నిలుస్తూ రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ. పదివేలు అందిస్తున్నారన్నారు. రైతు భీమా పథకాన్ని కూడా అమలు చేస్తున్నారని పేర్కోన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. పది వేలు అందిస్తూ స్వయంగా పంటపొలాలను పరిశీలించి అక్కడే జీవో విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

రైతులకు మేలు చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని మరో సారి అధికారంలోకి తీసుకురావడానికి రైతులు ముందుండాలన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే డీ.ఎస్. రెడ్యానాయక్ మాట్లాడుతూ.. రైతులకు గతంలో ఏ ప్రభుత్వం ఇంతగా మేలు చేసిన దాఖలాలు లేవన్నారు. నిత్యం రైతులకు ఏదో చేయాలని తలంపుతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారన్నారు. వ్యవసాయ మార్కెట్ పదవుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ది కాదా అని అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ విధానం అమలు చేస్తున్నారా అని నిలదీశారు. పకృతి విలయానికి పంటలు నష్టపోతే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చిలిగవ్వ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. విమర్శులు చేస్తున్న విపక్షాలు తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలు ఏవి రైతులకు అనుకూలంగా ఉన్నాయో స్పష్టం చేయాలన్నారు. మీరెన్ని కలుల కన్నా అన్ని వర్గాలకు మేలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

వేధికపై ఉన్న మేమే తిరిగి గెలిచితీరుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. నిత్యం పాలేరుల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తున్న తామే తిరిగి గెలిచితీరుతామని పేర్కోన్నారు. ప్రజలకు ఇరవై గంటల పాటు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న తమనే అన్ని వర్గాల ఆశార్వాదాలు అందిస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడి నుంచి అమాసా, పున్నానికి ఒకసారి వచ్చే విపక్షల నాయకులు ఎన్నో కలలు కంటున్నారని, కానీ వారికి ఓట్లు అడిగే హక్కే లేదన్నారు. ఈ వేధికపై ఉన్న మేమంతా మళ్లీ పోటీ చేస్తామని.. మళ్లీ మేమే గెలిచితీరుతామని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌పార్టీని అన్ని వేళల్లో కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. అన్ని వర్గాల కోసం పరితపించే బీఆర్‌ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News