Monday, December 23, 2024

గ్రామీణ విద్యార్థులకు ఎంఎల్ఎ చేయూత

- Advertisement -
- Advertisement -

తాండూరు : గ్రామీణ విద్యార్థులకు చేయూతను అందించేందుకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ముందుకొచ్చారు. ఇప్పటికే తన సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించుకున్నారు. ఆర్టీసి అధికారులకు రూ.5లక్షలు నగదు చెల్లించారు. తాండూరు నియోజకవర్గంలోని విద్యార్థులు ఉచితంగా ప్రయాణం చేసేందుకు తనదైన శైలిలో ముందుకొచ్చారు. ఆర్టీసి బస్సులలో ప్రయాణించేందుకు ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లను జారి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బస్సు పాస్‌లను జారీ చేసేందుకు ఆర్టీసి ప్రతి విద్యార్థి నుంచి రూ.50 సర్వీసు చార్జీ రూపంలో వసూలు చేస్తుంది. ఈ మొత్తంను విద్యార్థుల తరపున ఆర్టీసికి చెల్లించేందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ముందుకొచ్చారు. తాండూరు బస్‌డిపో పరిధిలోని 10వేల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతి ఏటా ఉచిత బస్‌పాస్‌లను తీసుకుంటున్నారు.

విద్యార్థులు చెల్లించాల్సిన రూ.5లక్షలను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోమవారం తాండూరు డిపో మేనేజర్ సమతకు అందించారు. ఉచిత బస్‌పాస్‌లను తీసుకునే విద్యార్థుల నుంచి ఎలాంటి సర్వీసు చార్జీలను వసూలు చేయవద్దు అని ఆర్టీసి డిపోమేనేజర్ కు ఎమ్మెల్యే సూచించారు. ఒకే సారి 10వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ,విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఉచిత బస్‌పాస్‌లు పొందడానికి చెల్లించాల్సిన సర్వీసు చార్జీని చెల్లించడంతో పాటు బస్‌పాస్‌లను భద్రంగా ఉంచుకునేందుకు ప్రతి విద్యార్థికి ఒక పర్సును కూడా అందజేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. దీంతో తాండూరు డిపో మేనేజర్ సమత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేతుల మీదుగా గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు జారీ చేస్తామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News