హైదరాబాద్: బిఆర్‌ఎస్ తాండూరు ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి ఇడి విచారణకు హాజరు కాలేదు. అయితే, నోటీసులు అందుకుని విచారణకు సహకరిస్తా అంటూనే రోహిత్‌రెడ్డి గైర్హాజరవుతూ వస్తున్నారు. మంగళవారం సైతం ఆయన గైర్హాజరు కావడంతో ఇడి సీరియస్‌గా ఉంది. ఇడి విచారణ హాజరుపై రోహిత్‌రెడ్డి మొదట్నించీ నిర్లక్షంగా వ్యవహరిస్తున్నట్లు ఇడి భావిస్తోంది. మరోవైపు ఆయన హైకోర్టుకు వెళ్లడంపైనా ఇడి రగిలిపోతుంది. మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని ఇడి నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దఖలు చేశారు. ఇడి కేసును పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ నెల 15న పిఎంఎల్‌ఎ కింద ఇడి అధికారులు కేసు నమోదు చేశారు. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో భాగంగానే ఇడి అధికారులు ఈసిఐఆర్ 48/2022 నమోదు చేసి రోహిత్‌రెడ్డిని రెండ్రోజుల పాటు ప్రశ్నించారు.
ఇదే కేసులో అభిషేక్ అనే గుట్కా వ్యాపారికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. వీరిద్దరితో పాటు నందకుమార్‌ను కూడా ఇడి అధికారులు చంచల్‌గూడ జైలులో రెండ్రోజుల పాటు ప్రశ్నించారు. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో మనీలాండరింగ్ లేకుండానే ఇడి అక్రమంగా తనపై కేసు నమోదు చేసిందని రోహిత్‌రెడ్డి సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఇందుకు సంబంధించి రోహిత్‌రెడ్డి పలు సందర్భాల్లో మీడియా ముఖంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇడి పరిధి దాటి విచారణ జరుపుతోందని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధిస్తున్నారని కూడా రోహిత్‌రెడ్డి బాహాటంగానే చెప్పారు. అయితే, హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌లో ఇడి అధికారులు నమోదు చేసిన ఈసిఐఆర్ 48/2022ను పూర్తిగా రద్దు చేయాలని, ఎక్కడా మనీలాండరింగ్ జరగకుండానే ఇడి దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు.
భయపడను.. ధైర్యంగా ఎదుర్కొంటా…
అయితే ఇడి ఎదుట హాజరయ్యే విషయం న్యాయవాదులతో చర్చిస్తానన్నారు. వారి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇడి పరిధిలోకి రాని అంశాన్ని విచారిస్తున్నారని పునరుద్ఘాటించారు. కుట్రలో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తున్నారన్నారు. కేంద్రంతో పాటు ఇడి, ఇడి డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. బుధవారం రిట్ పిటిషన్‌పై విచారణ జరగనున్న నేపథ్యంలో న్యాయ వాదులతో చర్చించి, ఆ తర్వాత ఇడి ఎదుట హాజరు కావాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటానన్నారు.
వ్యక్తిగతంగా హాజరు కావాలా లేదా తమ ప్రతినిధిని పంపించాలా అనేది న్యాయవాది సూచనమేరకు చేస్తానని పేర్కొన్నారు. అయినా ఇందులో నేరం, మనీలాండరింగ్ లేదని.. అంతా కుట్ర సాగుతోందన్నారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇడి కేసులకు భయపడను, ధైర్యంగా ఎదుర్కొంటానని మరోమారు ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు.