Thursday, December 26, 2024

ఆరుగురిలో టికెట్ దక్కేదెవరికో..?

- Advertisement -
- Advertisement -

జన్నారం : అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలలు సమయం ఉన్నందున ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న అభ్యర్థులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలో మాత్రం టికెట్ కోసం అధిష్టానం వద్ద ముమ్మరంగా ప్రయత్నాలు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. అదిష్టానం సిట్టింగ్‌లకే టికెట్ ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికైనా ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు రాకుండా చూసుకోవాలని, లేకుంటే టికెట్ కట్ చేస్తానని కరాఖండిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమావేశంలో అందరి సమక్షంలో చెప్పిన విషయం విధితమే. ప్రస్తుతం ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారే ఎమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే రేఖానాయక్ రెండు సార్లు ప్రత్యర్ధులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ముచ్చటగా మూడోసారి సైతం తమకే టికెట్ వస్తుందని, అధిష్టానం తన పని తీరును చూసి తనకే టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉందని, అందుకోసమే పార్టీ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పని చేస్తున్నానని, అదే విధంగా ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నానని ఎమ్మెల్యే రేఖానాయక్ ధీమాలో ఉండగా జన్నారం మండలానికి చెందిన రాజ్యసభ సభ్యులు, జోగిన్‌పల్లి సంతోష్ అనుచరుడు బాదావత్ పూర్ణచందర్ నాయక్ గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో మకాం వేసి గ్రామాల్లో పర్యటిస్తూ అనుచర గణాన్ని కూడగట్టుకొని ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో తిరుగుతూ ఆపదలో ఉన్న వారికి ఆర్దిక సహాయం అందజేస్తూ శుభకార్యాలలో పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకే టికెట్ వస్తుందనే నమ్మకంతో ప్రజల్లో తిరుగుతున్నానని కరాఖండిగా చెబుతున్నారు.

అలాగే ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ సైతం టికెట్ రేసులో ఉన్నారు. ఒకతాటిపై ఉన్న పార్టీని చీల్చి గ్రూపులు చేస్తే పార్టీ కార్యకర్తలు తలో దారి చూసుకుంటారనే ఆలోచనతో ఉన్నానని, పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలు గ్రూపులకు తావు ఇవ్వకుండా అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చిన పార్టీ అభ్యర్ధిని గెలిపించుకంటామని జనార్దన్‌రాథెడ్ తెలిపారు. తాను కూడా టికెట్ రేసులో ఉన్నానని తెలిపారు. పార్టీ అధిష్టానంలో తన పేరు పరిశీలనలో ఉందని, అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని తెలిపారు. అదే విధంగా పురపాలక శాఖ మంత్రి , తారకరామారావు అనుచరుడు, చిన్ననాటి మిత్రుడు, జగిత్యాల జిల్లా ఇబ్రహం పట్నం మండలానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ జాన్సన్ నాయక్‌కు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ సొంత క్యాడర్‌ను పెంచుకోవడంలో నిమగ్నమయ్యారు.

ఈ నెల 6న జాన్సన్ నాయక్ జన్మదినం పురస్కరించుకొని ఖానాపూర్‌లో విందు ఏర్పాటు చేసి ఆ వేడుకల్లో ఎమ్మెల్సీ దండే విఠల్ సైతం హాజరయ్యారు. కేటీఆర్ తనకు టికెట్ హామీ ఇచ్చారని, ఎట్టి పరిస్ధితుల్లో తనకే టికెట్ వస్తుందనే ధీమాలో ముందుకు సాగుతున్నారు. అదే విధంగా జన్నారం మండలానికి చెందిన మరో వ్యక్తి హైదరాబాద్ రిటైర్డ్ కలెక్టర్ లావుడ్య శర్మ నాయక్ సైతం గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ యువకులను చేరదీస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి టికెట్ తనకే వస్తుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని ఖరాఖండీగా చెప్పుకుంటున్నారు. అలాగే మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. జగిత్యాల జిల్లా రాయికల్ జడ్పీటీసీ జాదవ్ అశ్విని సైతం ఎమ్మెల్యే బరిలో ఉంటున్నానని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జాదవ్ అశ్వినిది ఊట్నూరుకు చెందిన వ్యక్తి కాగా ఖానాపూర్‌లో సైతం ఇల్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈమెకు ఎమ్మెల్సీ కవిత సహకారం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే బాదావత్ పూర్ణచందర్ నాయక్, బుక్య జాన్సన్ నాయక్‌లు నియోజకవర్గంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు గ్రామ గ్రామాన వెలిసాయి. దీంతో పార్టీ క్యాడర్ మాత్రం అయోమయానికి గురవుతున్నారు. అధిష్టానం దృష్టి సాదించి కట్టడి చేయకుంటే పార్టీ నాయకులు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపడానికి అవకాశం ఉంటుందని పలువురు నాయకులు భావిస్తున్నారు. నియోజకవర్గం మూడు జిల్లాలను ఆనుకొని ఉండడంతో ఏ జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ చూపుతారో, లేక అధిష్టానమే తలగబెట్టి తమాషా చూస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News