హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి ఐటి అధికారుల ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు అడిగిన వివరాలను శేఖర్ రెడ్డి సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని పైళ్ల శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటి అధికారులు మూడ్రోజులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఈ సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోదాలు ముగించిన అనంతరం విచారణకు రావాల్సిందిగా పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటి నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల పైళ్ల శేఖర్ రెడ్డితో పాటు నాగర్‌కర్నూల్ ఎంఎల్‌ఎ మర్రి జనార్థన్ రెడ్డితో పాటు మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఒకరోజు ఐటీ అధికారులు సోదాలు జరపగా ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటి అధికా రులు మూడ్రోజులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలు కక్షపూరితమైనవని నేతలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల తాను ప్రాతినిధ్యం వహి స్తున్న భువనగిరి నియోజకవర్గంలో శేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన ఇమేజీ డ్యామేజ్ చేసేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడ్రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభించలేదని, తమ దగ్గరి నుంచి అధికారులు ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. “మూడు రోజులుగా ఐటి సోదాలపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. కొన్ని నివేదికలు ఐటి అధికారులు తన ఇంట్లో, తన బంధువుల ఇళ్లలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, తాను దక్షిణాఫ్రికాలో మైనింగ్ వ్యాపారం చేస్తున్నానని పేర్కొన్నాయి. ఈ కథనాలలో నిజం లేదు” అని పేర్కొన్నారు.