Sunday, December 22, 2024

బిఆర్ఎస్ చేసిన పాపాలన్నీ బయటపెడుతాం: వీరేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దళితుల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసేసిందని నకరేకల్ ఎంఎల్‌ఎ వీరేశం తెలిపారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా వీరేశం మాట్లాడారు. దళితబంధు పేరుతో బిఆర్‌ఎస్ నేతలు దళితులను మభ్యపెట్టారని మండిపడ్డారు. గత పదేళ్లలో దళితుల సంక్షేమానికి ఏం చేశారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతామని హెచ్చరించారు. బిఆర్ఎస్ మమల్ని మనుషులుగా కూడా చూడలేదని, బిఆర్‌ఎస్ తనని అవమానించడంతోనే కాంగ్రెస్‌లోకి వచ్చానని వివరణ ఇచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ తనకు తెలుసునని, బిఆర్‌ఎస్ పాలనలో ప్రగతి భవన్‌ను ప్రజలకు దూరం చేశారని దుయ్యబట్టారు. కంచెలు ఏర్పాటు చేసుకొని పదేళ్లపాటు పరిపాలించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రగతి భవన్ గొడలు బద్ధలుగొట్టామని ఘాటుగా వీరేశం విమర్శించారు. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజల బాధలు వింటున్నామని చెప్పారు.

అధికారంలో ఉన్నామని గర్వం ఉండకూడదని బిఆర్‌ఎస్ నేతలకు చురకలంటించారు. ప్రజల విశ్వాసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం మాది అని, కొన్ని నెలల్లోనే ఈ ప్రభుత్వాన్ని పడగొడతామనడం మంచిది కాదని వీరేశం హితువు పలికారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు బిఆర్‌ఎస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారని వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నేతలు మాట్లాడే భాష మార్చుకోవాలని హెచ్చరించారు. 2018లో ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైందని అడిగారు. అనేక నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని, గ్రామాల్లో బోర్లు వేసుకునే పరిస్థితి లేకుండా చేశారని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లాలో పదేళ్లుగా ఒక్క ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సాగునీటి రంగంలో దక్షిణ తెలంగాణపై వివక్ష ఎందుకు చూపించారని కెసిఆర్ ప్రభుత్వాన్ని అడిగారు. దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాత ప్రభుత్వం మాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News