Tuesday, December 24, 2024

ఫోన్ ట్యాపింగ్‌లో ప్రధాన సూత్రధారి కెటిఆర్:వేముల వీరేశం

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్‌లో ప్రధాన సూత్రధారి కెటిఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కంటే ప్రధాన పాత్రధారి అయిన కెటిఆర్‌ను ముందు విచారించాలన్నారు. ఫోన్లు విన్నది, ట్యాపింగ్ చేయించింది కెటిఆర్ అని, అయినా కూడా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేకపోయారన్నారు. బ్రతుకుమీద ఆశ లేదా? అని తనను కెటిఆర్ బెదిరింపులకు గురిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్రభాకర్ రావు తన టేబుల్ పైన వెపన్ పెట్టి పార్టీ మారొద్దని తనను బెదిరించారని ఆయన ఆరోపించారు. అధికారం లేకపోవడంతో కెటిఆర్‌కు నిద్ర పట్టడం లేదని, కెటిఆర్‌కు అధి కారం మీద తప్ప దేని మీద ధ్యాస లేదని వీరేశం విమర్శించారు. సిఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పది నెలలు కూడా అధికారం లేకుండా ఉండలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం కుట్రలు చేయడం పనిగా పెట్టుకున్నారని ఆయన దుయ్యబట్టారు.

అధికారం కోసం ప్రజాదరణ పొందేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రయత్నించేలా తప్ప దాడులు, ఫోన్ ట్యాపింగ్‌లు వంటి దుర్మార్గపు సంస్కృతీని అనుసరించడం సరైంది కాదన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సమాజం కుటుంబ దోపిడీతో, నియంతృత్వ పాలనతో నష్టపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పాలనలో రాష్ట్రం ముందు కెళుతుంటే అడ్డుపడటమే పనిగా బిఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మల్లన్న సాగర్ కోసం గత ప్రభుత్వం 12 గ్రామాల ప్రజలను బెదిరించి, దౌర్జన్యం చేసి భూసేకరణ చేసిందన్నారు. 10 ఏళ్లు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని బిఆర్‌ఎస్ అమలు చేసిందన్నారు. వెనుకబడిన నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అభివృద్ధి జరగొద్దా..? అని ఆయన ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో 1300ల మందిని కెటిఆర్, జగదీష్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారన్నారు.

లంబాడి మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది: ఎమ్మెల్యే, బాలునాయక్
దేవరకొండ ఎమ్మెల్యే, బాలునాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని, లగుచర్లలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపైన జరిగిన దాడి దురదృష్టకరమన్నారు. ఖమ్మంలో లంబాడి మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడు మండలంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి లంబాడి పైన దాడి చేయిస్తే కెటిఆర్ సమర్థించాడన్నారు. అచ్చంపేటలో గిరిజన ఆడబిడ్డను చెట్టు కట్టేసి కొట్టిన చరిత్ర బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఉగ్రవాదుల కంటే అధ్వానంగా లంబాడీలపైన గత ప్రభుత్వ హయాంలో దమనకాండ కొనసాగిందన్నారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడికి సెంటు స్థలం కేటాయించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. గిరిజనులపైన మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్ పార్టీకి లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News