Thursday, January 23, 2025

పిల్లా జెల్లా లేని వారు అబద్దాలు చెబుతారు: వివేకానంద

- Advertisement -
- Advertisement -

TRS MLA Vivekananda Fires on BJP
హైదరాబాద్: బిజెపి అంటే బడా జూటా పార్టీగా మారిందని ఎంఎల్ఎ కెపి వివేకానంద తెలిపారు. టిఆర్ఎస్ భవనం నుంచి ఎంఎల్ఎ కెపి వివేకానంద మీడియాతో మాట్లాడారు. మాటలు తప్ప పిఎం మోడీ పాలనలో చేతలు లేవని దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లలో మోడీ ఏ ఒక్క చెప్పుకోదగిన స్కీమ్ తీసుకరాలేదని, ధర్మం మతం పేరు చెప్పి బిజెపి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ప్రజలకు విషయాలన్నీ అర్థమవుతున్నాయని, అబద్దాలు, విద్వేషాలు ప్రచారం చేయడమే బిజెపి పనిగా పెట్టుకుందని విమర్శించారు. జెపి నడ్డా నిన్న ఎపిలో ఆరోగ్యశ్రీ తమ ఆయుష్మాన్ పథక మేనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జనం నవ్వుకుంటున్నారని, కెసిఆర్ ఆరోగ్య శ్రీ గురించి ఎప్పుడో అసెంబ్లీ లో చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తమవని బిజెపి నేతలు చంకలు గుద్దుకుంటున్నారన్నారు. చరిత్రను వక్రీకరించడమే బిజెపి నేతల పని అని, హోమంత్రి అమిత్ షా తెలంగాణ కోసం అల్లూరి సీతారామ రాజు కొట్లాడారని మాట్లాడి నవ్వుల పాలయ్యారని చురకలంటించారు. ట్రిపుల్ ఆర్ సినిమా చూసి అలా మాట్లాడరేమోనని,  మోడీ కూడా ఏం తక్కువ తినలేదని, పిల్లా జెల్లా లేని వారు అబద్దాలు మాట్లాడుతూ తిరుగుతారని, మోడీ అదే కోవకు చెందుతారని విమర్శించారు.

సిఎం కెసిఆర్ రెండో సారి ప్రజా ఆదరణ మరింత పెంచుకుని అధికారం లోకి వచ్చారని, యోగి యుపిలో సీట్లు ఓట్లు తగ్గించుకుని అధికారం లోకి వచ్చారని చురకలంటించారు. మిషన్ భగీరథ తమ జల్ జీవన్ మిషన్ పథకమేనని శుద్ధ అబద్ధాన్ని కేంద్రం ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. జల్ జీవన్ మిషన్ కంటే ముందే మిషన్ భగీరథ ను మోడీ తెలంగాణ లో ప్రారంభించి సిఎం కెసిఆర్ ను మెచ్చుకున్నారని కెపి వివేకానంద గుర్తు చేశారు. ఈ విషయం కేంద్రానికి, బిజెపి నేతలకు తెలియదా? అని అడిగారు. ఈ దుష్ప్రచారం ప్రజలు గ్రహించాలని,  రైతు బంధు లేక పోతే కిసాన్ సమాన్ నిధి ఆలోచన కేంద్రానికి వచ్చేదా? అని ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్ఫ్యూషన్ రెడ్డి గా మారారని,  ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ పిచ్చొడి లా మాట్లాడుతున్నారని, పిచ్చోడి చేతిలో రాయిగా బిజెపి మారిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మతిస్థిమితం లేని సంజయ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.  మసీదు లో లింగాలు వెతుకుతామని అన్న సంజయ్ ది బిజెపి వైఖరా? వ్యక్తి గత వైఖరా? చెప్పాలని కెపి వివేకానంద డిమాండ్ చేశారు.

ఉర్దూ భాషను నిషేధిస్తానన్న సంజయ్ ది వ్యక్తిగత వైఖరా? పార్టీ వైఖరా? బిజెపి జాతీయ నాయకత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ కన్నా ఎక్కువగా మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా మాట్లాడిన బండి సంజయ్ పై బిజెపి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  బండి సంజయ్ మీద చర్యలు తీసుకోవాలని చట్ట పరంగా కేసులు పెడుతామన్నారు. జిహెచ్ఎంసి బిజెపి కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారని, అందుకే మోడీ వారిని ఢిల్లీ పిలుచుకున్నారని,  మోడీ వారికి అబద్దాలు వ్యాప్తి చేయడంలో ట్రైనింగ్ ఇచ్చారా? అని అడిగారు. తెలంగాణకు అభివృద్ధి చేసే పథకాలు ఏమైనా ఇచ్చారా?,  ఎనిమిదేళ్లలో ఎనిమిది పైసలు మోడీ తెలంగాణ కు ఇవ్వలేదని, కనీసం ఈ రోజైనా మోడీ ఏదైనా ప్రకటించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News