Monday, December 23, 2024

సిఎం వ్యాఖ్యలపై సునీత నోరేత్తరేం?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః పాలకుర్తి యువ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి బిఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికై వచ్చిన తమ వంటి వారికి ఇలాగేనా అసెంబ్లీలో వ్యవహరించే తీరు నేర్పేదని మండిపడ్డారు. శాసనసభలో సిఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిల మధ్య జరిగిన సంభాషణ, అనంతరం కెటిఆర్ జోక్యంతో జరిగిన వాగ్వాదం తదితర అంశాపై యశస్విని రెడ్డి మీడియాపాయింట్‌లో పలువురు మహిళా ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి తదితరులతో కలిసి మాట్లాడారు. ఎమ్మెల్యే సునీత లకా్ష్మరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని యశస్వినిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పట్టుకుని సబితా ఇంద్రారెడ్డి, కెటిఆర్‌లు నోటికొచ్చినట్లు మాట్లాడడం మంచిదేనా అని అన్నారు. సునీత లకా్ష్మరెడ్డి ప్రాంతంలో ప్రచారానికి వెళ్లినందుకు రేవంత్‌రెడ్డిపై రెండు కేసులు నమోదు చేశారని, ఇప్పటికీ ఆ కేసులు అలాగే ఉన్నాయని అన్నారు.

అవన్నీ చూసిన మాకే ఎంతో బాధగా ఉందని, మరి సునీత లకా్ష్మరెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదని అన్నారు. కొత్తగా వచ్చిన తమ వంటి శాసనసభ్యులకు ఏమైనా నాలుగు మంచి మాటలు నేర్పాలి గానీ ఇలా చేస్తే ఎలా అని వాపోయారు. రెండు రోజుల కిందట బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు మంత్రి సీతక్కను నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. అప్పుడు మేము ఇట్లాగే పోయామా..? ఎక్కడ గోల చేయలేదు కదా అని అన్నారు. మాకు ఒక పద్దతి ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే క్రమ శిక్షణతో కూడిన పార్టీ అని అన్నారు. మేము అధికారంలో ఉన్నాము కాబట్టి ఒక హద్దు గీసుకుని ఆ హద్దులోనే ఉంటున్నాం తప్ప ఎవరి మీద గొడవ చేయడం లేదని పేర్కొన్నారు. సీతక్కను అన్నప్పుడు మేము కూడా ఇంతకు మించిన రచ్చ చేయవచ్చునని తెలిపారు. కానీ అలా మేము చేయలేదని అన్నారు. గత పదేళ్లలో ఏం చేశారో రాష్ట్రంలో అందరూ చూశారని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు.

మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలే హడావుడి
రాష్ట్ర శాసనసభలో బుధవారం జరిగిన పరిణామాల నేపధ్యంలో తమ వైఖరి వ్యక్తం చేసేందుకు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌లో బిఆర్‌ఎస్, బిజెపి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు మీడియా పాయింట్ వద్ద గందరగోళం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాపాయింట్ వద్ద వరుసగా మాట్లాడుతుండడంతో తమకు అవకాశం ఇవ్వడం లేదని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. మీడియా పాయింట్‌లో ప్రతిపక్షాలు మైక్ కోసం నువ్వా నేనా అన్నట్లుగా తొందర పడ్డారు. సభ వాయిదా అనంతరం అధికార కాంగ్రెస్ సభ్యులు ఒకరి తర్వాత మరొకరు వరుసగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. దీంతో కావాలనే కాంగ్రెస్ సభ్యులు మీడియా పాయింట్‌లో ఎక్కువ సేపు మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్ద అవకాశం కోసం బీఆర్‌ఎస్ ఎదురుచూస్తున్న క్రమంలో మరో వైపు బీజేపీ సభ్యులు సైతం మైక్ కోసం వేచి చూశారు. దీంతో ఎవరికి వారు మాట్లాడడంతో కాసేపు గందరగోళం సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News