మన ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బిజెపి, నిందితులు దాఖలు పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసును సిబిఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోద ని సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్ర స్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్ తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. విచారణ పై అనుమానాలున్నాయని, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.
ఇరువర్గాల సుదీర్ఘ వాదనల తర్వాత కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను సిబిఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. అనంతరం బిజెపి తరపున వాదించిన రామచందర్‌రావు మీడియాతో మాట్లాడు తూ.. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగలేదని ఆరోపించారు. కేసులో సాంకేతిక అంశాలను పట్టించుకోలేదని అన్నారు. రాజకీయం గా వేదిస్తున్నారని కోర్టుకు వివరించామని తెలిపారు. సంబం ధం లేకున్నా..బిజెపి పేరు ప్రస్తావించారని, రాజకీయ దురుద్దేశాలతోనే కేసు పెట్టారని ఆరోపించారు.
సిఎం ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేశారని, అవినీతి నిరోధక శాఖకు తప్ప సిట్‌కు విచారణ అధికారం లేదని రామచందర్‌రావు తెలిపారు. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు యత్నించారంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సింహయాజీ, రామచంద్రభారతి, నందకుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. అయితే, సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదంటూ బిజెపి, నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా కేసును సిబిఐకి అప్పగించింది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాలను సిబిఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ.. ప్రభు త్వం జారీచేసిన ఉత్తర్వులను సైతం హైకోర్టు రద్దు చేసింది.
టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలుకు భారీ స్కెచ్
రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఎంఎల్‌ఎల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెం దిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు.
అప్రమత్తమైన ఎంఎల్‌ఎలు దీనిపై తమకు ఫిర్యాదు చేశారని.. తమకు డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపించి పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళిక ప్రకారంతో వల పన్ని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. ఈ బృందం రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సిసిసి) కేంద్రంగా దర్యాప్తును కొనసాగిస్తోంది.