Friday, January 17, 2025

‘ఎంఎల్‌ఎలకు ఎర కేసు’.. రాష్ట్ర బిజెపి నేతలకు నోటీసులు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిట్ అధినేత హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలోని సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక సూత్రధారులను గుర్తించేందుకు, కీలక ఆధారాల సేకరణలో సిట్ నిమగ్నమైంది. సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ 17వ అంతస్తులోని సిట్ కార్యాలయంలో మరో న్యాయవాదితో కలిసి సిట్ ముందుకు కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్ హాజరయ్యారు. శ్రీనివాస్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణ బిజెపి నేతలకు సిట్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. మరోవైపు సోమవారం సిట్ విచారణకు హాజరవ్వని బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలపై లీగల్‌గా వెళ్లాలని సిట్ నిర్ణయిం చినట్లు తెలుస్తోంది.

అంతకుముందు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌తో సహా నలుగురిని సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌తో పాటు కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుడు డాక్టర్ జగ్గుస్వామి, కేరళలోని భారత ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్ సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. 41 సిఆర్‌పిసి నోటీసులు కావడంతో వీరంతా వ్యక్తిగతంగానే సిట్ ఎదుట హాజరవ్వాల్సి ఉంది. సోమవారమే విచారణకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొన్న ప్పటికీ న్యాయవాది బూసారపు శ్రీనివాస్ మినహా మిగతా వారెవరూ సిట్ ముందు హాజరవ్వలేదు.

శ్రీనివాస్‌ను సిట్ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఎంఎల్‌ఎల కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్న సింహయాజులు స్వామీజీకి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలు చేశారని శ్రీనివాస్‌పై ఆరోపణలు వస్తున్నాయి. అక్టోబర్ 26 న తిరుపతి నుండి హైదరాబాద్‌కు సింహయాజులు స్వామిజీకి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా సిట్ అధికారులు సేకరించారు. ఈ ఆధారాల నేపథ్యంలో సింహయాజులు స్వామీజీతో శ్రీనివాస్‌కు ఉన్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్‌తో సింహయాజులు స్వామీజీకి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించిన వ్యక్తులు ఎవరన్న దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ లిస్ట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆధారాలను ముందు ఉంచి సిట్ అధికారులు విచారణ నిర్వహించారు. రాజేంద్ర నగర్ ఎసిపి గంగాధర్ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగింది. మంగళవారం మరోసారి సిట్ ముందుకు శ్రీనివాస్ విచారణకు హాజరు కానున్నారు.

ఇదిలా ఉండగా, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌కు నోటీసులు అందిన నాటి నుంచి ఈ కేసులో పరిణామాలు ఆసక్తికరంగా మారిన సంగతి విదితమే. ఆయన సిట్ విచారణకు వస్తారా? లేదా? అన్న అంశం ఆద్యంతం ఉత్కంఠను రేపింది. కానీ బిఎల్ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన మిగతా ఇద్దరు అనుమానితులు సిట్ నోటీసులకు స్పందించలేదు. సిట్ విచారణకు ఒక రకంగా డుమ్మా కొట్టారు. మరోవైపు హైదరాబాద్‌లో జరుగుతున్న బిజెపి శిక్షణా తరగతులకు సైతం బిఎల్ సంతోష్ హాజరు కాకపోవడం కూడా సిట్ ఎఫెక్టేనని చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News