Monday, December 23, 2024

కెటిఆర్‌కు ప్రత్యర్థిగా నేనే బరిలో దిగుతా:ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కెటిఆర్‌కు లేదని, తాను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతానని, సిరిసిల్లలో రాజీనామా చేసి కెటిఆర్ మల్కాజిగిరి లేదా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానంటే తాను కూడా ఆయన ప్రత్యర్థిగా పోటీకి సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్‌కు సవాల్ విసిరారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న కాంగ్రెస్ పార్టీ తరుపున తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తానని, ఎవరివైపు న్యాయం ఉంది, ఎవరిని గెలిపించాలన్నది ప్రజలు నిర్ణయిస్తారని కెటిఆర్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని బల్మూరి వెంకట్ అన్నారు. సంస్కారం గురించి కెటిఆర్ మాట్లాడుతుంటే నవ్వు వస్తుందని వెంకట్ ఎద్దేవా చేశారు. గతంలో కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు సమాజం మొత్తం చూసిందని ఆయన ఎద్దేవా చేశారు. శాసనసభలో కూడా కెసిఆర్ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే ఎంత ఎగతాళిగా మాట్లాడారో ప్రజలు గమనించారన్నారు.

కెసిఆర్ సవాల్‌ను రేవంత్ స్వీకరించారు….
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కెసిఆర్ అన్నారని, పిసిసి అధ్యక్షుడి స్థాయిలో రేవంత్ రెడ్డి సవాల్‌ని స్వీకరించి 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం మొదటి రోజు నుంచే ఇచ్చిన 6 గ్యారంటీల పై చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలపై పగలు,రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. సెక్రటేరియట్‌లో ఎప్పుడు అందు బాటులో ఉంటూ ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ గతంలో దళితుడిని సిఎం చేస్తానని చేయలేదని, కెజి టు పిజి ఉచిత విద్య అని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. యువకులకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారని, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అని మోసం చేశారని బల్మూరి వెంకట్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి సిఎం గా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. మిగిలిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News