Tuesday, February 25, 2025

ఎంఎల్‌సి ఎన్నికల్లో ఆ విధంగా ఓటు వేస్తే చెల్లదు

- Advertisement -
- Advertisement -

సాధారణ ఎన్నికలతో పోల్చితే
భిన్నంగా ఎంఎల్‌సి ఓటింగ్ విధానం
ఏమరుపాటు ప్రదర్శిస్తే
ఓటు చెల్లకుండా పోయే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగనున్నది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సితోపాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలు జరుగనున్నాయి. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు వేసే విధానం సాధారణ ఎన్నికలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. ఓటింగ్ విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించి సిద్ధం చేసినా ప్రతి ఎన్నికలో కొన్ని ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. ఉపాధ్యాయులు, పట్టభద్రులు వేసే ఎంఎల్‌సి ఎన్నికల్లోనూ కొన్ని ఓట్లు చెల్లకుండా పోతుంటాయి. చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ఎంపి, ఎంఎల్‌ఎల ఎన్నికలు సహా స్థానిక సంస్థల్లో ఓట్ల విధానం కంటే కొంత తేడా ఉంటుంది. ఓటరు ఎక్కడ ఏమరపాటు ప్రదర్శించినా వేసిన ఓటు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఓట్ల లెక్కింపు కూడా భిన్నంగానే ఉంటుంది.
ఓటు ఎలా వేయాలి..?
ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన దాని ప్రకారం పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఊదారంగు స్కెచ్‌పెన్‌తో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గదిలో ప్రాధాన్యత క్రమంలో భాగంగా (1), (2) నెంబర్లు వేయాలి. ఇందులో ముందుగా మొదటి ప్రాధాన్యత ఓటు(1) వేయకుండా రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే చెల్లుబాటు కాదు. బ్యాలెట్ పత్రంపై ఒకటి, రెండు అని అక్షరాల్లో రాసినా ఓటు పనికిరాకుండా పోతుంది. ఓటు చెల్లుబాటు కావాలంటే ఓటరు ఎంపిక చేసే అభ్యర్థి ఎవరైనప్పటికీ (1) నంబర్‌ను తప్పక వేయాల్సిందే. (1) నంబర్ వేయకుండా కేవలం (2) నంబర్ మాత్రమే వేస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. వేసే నంబర్లు కూడా అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉండే గది మధ్యలోనే వేయాలి. పెన్సిల్ లేదా పెన్నుతో నంబర్లు వేయకూడదు. నెంబర్లకు బదులు అభ్యర్థి పేర్లు రాసినా, రైట్‌మార్కు, ఇంటూ మార్కు వేసినా ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్ పత్రంపై ఎలాంటి గీతలు, రాతలు రాయరాదు. బ్యాలెట్ పేపర్‌ను పోలింగ్ అధికారి మలిచినట్లు మలిచి బాక్సులో వేయాలి.
కోటా నిర్ణయం ప్రకారం లెక్కింపు
కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన కోటా సూత్రీకరణ ప్రకారం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దీని ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో చెల్లుబాటైన ఓట్ల సంఖ్య/ ఎన్నుకోబడే అభ్యర్థుల సంఖ్య+1+1 అనే ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన సూత్రానికి అనుగుణంగా ఓట్లను లెక్కిస్తారు. ఉదాహరణకు ఇద్దరే అభ్యర్థులు ఉండి 937 ఓటర్లలో 650 ఓట్లు పోలైతే అందులో 600 ఓట్లే చెల్లుబాటు అయ్యాయి అనుకుంటే.. సూత్రీకరణ ప్రకారం 600/2+1+1= లెక్క తీస్తారు. వీటిలో ఎక్స్ అనే అభ్యర్థికి 301 ఓట్లు వచ్చి, వై అనే అభ్యర్థికి 299 ఓట్లు వస్తే సహజంగానే ఎక్స్ అనే వ్యక్తిని విజయం సాధించినట్లే. కోటా సూత్రం ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు ముగ్గురు, ఆపైన ఉంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి ఆ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో జమచేస్తూ లెక్కింపు ఉంటుంది. ఒకవేళ ఇద్దరే అభ్యర్థులు బరిలో ఉంటే ఎలిమినేషన్ పద్ధతికి ఆస్కారం ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News