Monday, January 20, 2025

రాష్ట్రంలో ఎంఎల్‌సి ఎన్నికల సందడి

- Advertisement -
- Advertisement -

 వచ్చే ఏడాది మార్చి29తో
ముగియనున్న ఒక
గ్రాడ్యుయేట్, రెండు టీచర్
ఎంఎల్‌సిల పదవీకాలం
కొనసాగుతున్న ఓటరు నమోదు
ప్రక్రియ నవంబర్ 23న
ముసాయిదా జాబితా ఇప్పటికే
అభ్యర్థులను ప్రకటించిన కొన్ని
ఉపాధ్యాయ సంఘాలు,
మరికొందరు త్వరలో ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంఎల్‌సి ఎన్నికల హడావిడి మొదలైంది. రెండు టీచర్ ఎంఎల్‌సిలు, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సికి ఓటర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు ఎంఎల్‌సి ఎన్నికలకు నవంబరు 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగనున్నది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓటర్లు నమోదు చేసుకోవచ్చు. శాసనమండలిలో మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సిగా ఉన్న జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), ఉపాధ్యాయ ఎంఎల్‌సిలుగా ఉన్న రఘోత్తం రెడ్డి, (మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్), అలుగుబెల్లి నర్సిరెడ్డి (వరంగల్ -ఖమ్మం -నల్లగొండ) పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ తేదీ నాటికి వీరి స్థానాల్లో కొత్త ఎంఎల్‌సిలను ఎన్నుకునే ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఈ ఎన్నికలకు 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సిల పదవీ కాలం 2025 మార్చి 29తో పూర్తి కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాష్ట్ర ఎన్నికల సంఘం మొదలు పెట్టింది. నవంబర్ 1న కటాఫ్ (క్వాలిఫైయింగ్) డేట్‌గా పెట్టుకుని ఓటర్ల జాబితాను రూపొందించాల్సిందిగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. గతంలో ఓటు ఉన్నా మరోసారి ఓటు నమోదు చేసుకోవాల్సిందేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు పెద్ద ఎత్తున ఓటరు నమోదు చేపట్టడంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆయా ఎంఎల్‌సి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరికొందరు త్వరలోనే ప్రకటించనున్నారు. ఆశావహులైన కొంతమంది అభ్యర్థులు స్వతంత్రంగా బరిలోకి దిగనున్నారు.

అభ్యర్థులను ప్రకటించిన టిఎస్‌యుటిఎఫ్, పిఆర్‌టియుటిఎస్

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( టిఎస్ యుటిఎఫ్) తరపున ప్రస్తుత ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డినే మరోమారు నిలపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వరంగల్ -ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గానికి పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ నియోజకవర్గానికి వంగ మహేందర్ రెడ్డిని పిఆర్‌టియుటిఎస్ తరపున తమ అధికారిక అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ఆయా సంఘాల ప్రతినిధులు ఆయా ఉపాధ్యాయ ఎంఎల్‌సి నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఓటరు నమోదు చేపట్టంపై దృష్టి సారిస్తున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు.

నవంబర్ 23న ముసాయిదా జాబితా

మూడు ఎంఎల్‌సి నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా, అర్హత కలిగిన వారు నవంబర్ 6వ తేదీ వరకు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటన్నింటిని పరిశీలించి నవంబర్ 23వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. ముసాయిదాపై అభ్యంతరాలు, వినతులకు డిసెంబర్ 9వ తేదీ వరకు గడువు ఉంది. వాటిని పరిష్కరించి డిసెంబర్ 30వ తేదీన మూడు ఎంఎల్‌సి నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాలను ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News