Thursday, January 23, 2025

తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోంది

- Advertisement -
- Advertisement -

MLC Kavitha addressing in National happiness unicorn

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, తలసరి ఆదాయ అవసరాలను
సమర్ధ్దించగల బలమైన వ్యవస్థను ఏర్పరచుకుంది
‘నేషనల్ హ్యాపీనెస్ యూనికార్న్’ అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోందని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, తలసరి ఆదాయ అవసరాలను సమర్ధ్దించగల బలమైన వ్యవస్థను ఏర్పరచుకుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ దిశగా, హార్ట్‌ఫుల్‌నెస్, ఆనందం ప్రాముఖ్యతను, అవి అందించగల బలమైన పునాదిని తాము గుర్తించామని ఆమె పేర్కొన్నారు. హైదారాబాద్‌కు దగ్గరలోని హార్ట్‌ఫుల్‌నెస్ ప్రధానకేంద్రమైన పచ్చని కాన్హా శాంతి వనంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ [HET], ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ [AICTE] భాగస్వామ్యంతో ‘నేషనల్ హ్యాపీనెస్ యూనికార్న్’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరుకావడంతో ఈ సభకు ఆమె అధ్యక్షత వహించారు.

కవితతో పాటు ఈ సమావేశానికి సుమారు 10,000ల మంది హాజరయ్యారు. 150 దేశాల నుండి కొన్ని వేలమంది వర్చ్యువల్‌గా పాల్గొనగా, హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ‘హార్ట్‌ఫుల్ కాంపస్’, ‘యువర్ వన్ లైఫ్’ లతో కలిసి ఈ అవార్డుల విజేతలను నిర్ణయించారు. రామచంద్ర మిషన్ అధ్యక్షుడు, హెచ్‌ఈటి వ్యవస్థాపకులు కమలేష్ పటేల్ [దాజీ], ఏఐసిటిఈ డాక్టర్ అనిల్ సహస్రబుద్ధి, ‘యువర్ వన్ లైఫ్’కు చెందిన యోగి కోచార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ‘తెలంగాణ హృదయం ఆనంద నాదానికి’ నాట్యం చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వరకే సమర్ధించడం లేదని ఇది భారతదేశం మొత్తాన్నీ ప్రభావితం చేయగలదని ఆమె పేర్కొన్నారు. ఇటీవల హెచ్‌ఈటి, ‘యువర్ వన్ లైఫ్’ మధ్య ఒక అవగాహన ఒప్పందం జరగ్గా దానికి, ‘యువర్ వన్ లైఫ్’ తరపునుంచి డా. నివేదిత శ్రేయాన్స్, రమేశ్ కృష్ణన్‌లు ప్రాతినిథ్యం వహించారు.

సుఖదుఃఖాల ద్వంద్వాలకు అతీతంగా ఎదగాలి: కమలేష్ పటేల్
మనం ఏ పని చేసినా, అందులో ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ ఆనందం ఎక్కువకాలం నిలబడదని, దీనిని శ్రీ కృష్ణుడు భగవద్గీత లోని 2వ అధ్యాయంలో అర్జునుడికి వివరించాడని కమలేష్ పటేల్ (దాజీ) పేర్కొన్నారు. సుఖదుఃఖాల ద్వంద్వాలకు అతీతంగా మానవుడు ఎదగాలని, వాటికి ప్రభావితం కానివాడే మోక్షానికి అర్హుడని ఆయన తెలిపారు.

సోషల్ మీడియా సెగ లాంటిది: డా. అనిల్ సహస్రబుద్ధే
సోషల్ మీడియా అనేది ఒక సెగ లాగా నేటి తరం విద్యార్థుల ధ్యాసను, వారి మానసిక స్థితులను ఎంతగానో ప్రభావితం చేస్తుందని డా. అనిల్ సహస్రబుద్ధే, ఏఐసిటిఈ పేర్కొన్నారు. అది కేవలం వారు ధ్యాసను నిలిపి ఉంచగలిగే సామర్ధ్యాన్ని మాత్రమే గాక వారి శారీరిక, మానసిక, నరాల వ్యవస్థను కూడా ఎంతగానో దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘యువర్ వన్ లైఫ్’ అనే కార్యక్రమాన్ని భారత దేశ పాఠ్య అంశాల్లో భాగం చేసేందుకు అనుమతించడమయ్యిందన్నారు. అందుకు తాము ఎన్‌ఈపికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

దేశవ్యాప్తంగా అవార్డులు సాధించిన కాలేజీలు
తెలంగాణాకు చెందిన ముఫకమ్ జా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెయింట్ మార్టిన్ అండ్ సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌కు అవార్డులు లభించాయి. వీటితో పాటు లవ్లీ ప్రొఫెషనల్ యూనివెర్సిటీ (పంజాబ్), మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ (రాజస్థాన్), జైపూరియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (రాజస్థాన్), ఆర్యన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ [చండీఘర్‌], మణిపుర్ యూనివర్సిటీ, ఎస్‌జిటీ యూనివెర్సిటీ (హర్యానా), సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ (సిక్కిం), కైట్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ (ఘజియాబాద్). నేతాజీ సుభాష్ చంద్ర ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ (ఢిల్లీ), వెలమ్మాళ్ ఇంజనీరింగ్ కాలేజీ (తమిళనాడు), మర్ బసెలస్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కేరళ), జేఎస్‌ఎస్ అకాడెమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (కర్ణాటక), కలశలింగం ఆకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (తమిళనాడు), అమృత్సర్ గ్రూప్ ఆఫ్ కాలేజేస్ (పంజాబ్), అంబాలిక ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ (యూపి), భారతి విద్యాపీఠ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (మహారాష్ట్ర), టెక్నియ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ అద్వానస్డ్ స్టడీస్ (ఢిల్లీ), లక్ష్మీనారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (మధ్యప్రదేశ్)లకు ఈ అవార్డులు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News