హైదరాబాద్: ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని, తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బిఎల్ సంతోష్ సిట్‌ముందుకు ఎందుకు రావడం లేదని, సిట్ ముందుకు వచ్చేందుకు బిఎల్ సంతోష్‌కు భయమెందుకు..? అని కవిత ప్రశ్నించారు? బిజెపి నాయకులు, బిజెపిలో చేరిన నాయకులపై ఈడీ, సీబిఐ కేసులు ఉండవనీ, బిజెపిని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడతారని ఆమె ఆరోపించారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉందని, ఏ విచారణనైనా తాము ధైర్యంగా ఎదుర్కొంటామని కవిత తేల్చిచెప్పారు.
బిజెపికి ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్ పార్టీయే..
మోడీ వన్ నేషన్.. వన్ ఫ్రెండ్ స్కీమ్ అమలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. బిజెపికి ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్ అవుతుందన్నారు. మహిళా బిల్లు ఆందోళన అనగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చారని, వంటగ్యాస్ ధరలపై మరొకరు గళమెత్తితే వాళ్లకు కూడా ఈడీ నోటీసులు ఇస్తారని కవిత పేర్కొన్నారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారని కవిత ధ్వజమెత్తారు.
నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు..
నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావొచ్చని కవిత పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బిజెపి విధానమన్నారు. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే బిజెపి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. తమ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందన్నారు. దర్యాప్తు సంస్థలతో తమపై దాడులు చేయిస్తోందని, ఈడీ, సిబిఐ, ఐటీ బెదిరింపులకు పాల్పడుతోందని కవిత తెలిపారు.
బిల్లు తెచ్చి బిజెపి చిత్తశుద్ధిని చాటుకోవాలి
1996 లో అప్పటి ప్రధాని దేవెగౌడ మహిళ రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రయత్నం చేశారని, అనంతరం ప్రతి ప్రధాని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, ఒక్క ప్రస్తుత ప్రధాని మోడీకి మాత్రం మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చే ఆలోచన చేయలేదని ఆమె ఆరోపించారు. ఈ రెండు సెషన్స్‌లో బిల్లు పెట్టుకునే అవకాశం ఉందని, మహిళ రిజర్వేషన్ల బిల్లు తీసుకురావడం ఒక చారిత్రాత్మక సమయమని అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రధానికి గుర్తు చేస్తున్నానని ఆమె తెలిపారు. బిల్లులో ఉండే అంశంపై రాజకీయంగా చర్చలు ఉంటాయని ఆమె తెలిపారు.
డ్రాఫ్ట్ బిల్లు తెస్తే అన్ని పక్షాలు కూర్చొని చర్చిస్తాయని, 131 ఫైనాన్స్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పాస్ చేసుకుందని కవిత పేర్కొన్నారు. జిఎస్టీ, ట్రిపుల్ తలాక్ బిల్లు, సిటీజన్ షిప్ అమైండ్‌మెంట్ బిల్లు ఇలాంటి బిల్లులను గంటలలో చర్చలు లేకుండా పాస్ చేసుకున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం లేదనీ, దేశానికి, ప్రజాస్వామ్యానికి ఉపయోగకరమైనదేనని ఆమె తెలిపారు. బిల్లు తెచ్చి చిత్తశుద్ధిని చాటుకోవాలని బిజెపిని కోరుతున్నానని కవిత పేర్కొన్నారు. మజ్లీస్ పార్టీకి ఆహ్వానం పంపించామని, వారి ప్రతినిధులు వస్తారని కవిత చెప్పారు.
నా దీక్ష విజయవంతం అయినట్టే
తాను మహిళా బిల్లు అనగానే బిజెపికి మహిళలు గుర్తుకు రావడం మంచిదేనని, నా దీక్ష విజయవంతం అయినట్టేనని కవిత పేర్కొన్నారు. మార్చి 2వ తేదీన ధర్నా ప్రకటన చేశానని, 7వ తేదీన అర్ధరాత్రి నోటీసు ఇచ్చారని కవిత పేర్కొన్నారు. 5 రోజుల తర్వాత నోటీసు ఇచ్చింది వాళ్లనీ, ధర్నాను డిస్టర్బ్ చేయాలనుకునేదే వాళ్లనీ. తనకు ధైర్యం ఉందనీ, 9వ తేదీన దీక్షా సమయమని, 11వ తేదీన విచారణకు వస్తానని చెప్పానని, కచ్చితంగా విచారణకు వెళతానని కవిత పేర్కొన్నారు. బిఎల్ సంతోష్ ఎందుకు సిట్ ముందుకు రావడం లేదని, కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చుకున్న వ్యక్తులు నా మీద మాట్లాడితే ఎలాగని కవిత ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు న్యాయస్థానాలకు వెళతానని కవిత పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ చెప్పినట్లు ఇది ఈడీ నోటీసు కాదనీ మోడీ నోటీసు అని ఆమె ఆరోపించారు.