Monday, January 13, 2025

శైలజ కుటుంబానికి ఎంఎల్‌సి కవిత రూ. 2 లక్షల ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ పాఠశాలలో విషాహారం తిని మరణించిన శైలజ కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శైలజ కుటుంబాన్ని ఎవరు పట్టించుకోవడం లేదన్న విషయాన్ని కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ జాగృతి నాయకులు పార్శా చంద్రశేఖర్ ఎంఎల్‌సి కవిత దృష్టికి తీసుకొచ్చారు. దాంతో చలించిపోయిన ఎంఎల్‌సి కవిత రూ. 2 లక్షల మేర ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తాను స్వయంగా వాంకిడిలో పర్యటించి శైలజ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తామని తెలిపారు. కాగా, ప్రభుత్వం ఆ కుటుంబానికి తగిన ఆర్థిక సాయం చేయడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హామీల అమలుపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి : ప్రజలకు కవిత పిలుపు
బూటకపు హామీలతో తెలంగాణ యువతను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. యువకులకు ఇచ్చిన హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. హామీలు ఏమైయ్యాయని కాంగ్రెస్ పార్టీ నాయకులను గట్టిగా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన తెలంగాణ జాగృతి నాయకులతో శుక్రవారం నాడు తన నివాసంలో ఎంఎల్‌సి కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ… యువ వికాసం కింద రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని, విద్య జ్యోతుల పథకం కింద ఎంఫిల్, పిహెచ్‌డి పూర్తి చేసిన ఎస్‌సి, ఎస్‌టి యువతకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి ప్రస్తావనే చేయకపోవడం శోచనీయమని విమర్శించారు.

అలాగే, రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న బిసిలకు 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ… కనీసం అసలు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్నే ఇవ్వడం లేదని ఎండగట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి చెబుతున్న నియామక లెక్కల్లో అనేక వాటికి బిఆర్‌ఎస్ పార్టీ హయాంలోనే పరీక్షలు జరిగాయని గుర్తు చేశారు. మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పటి నుంచి చెల్లిస్తారో సిఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లీటర్ పెట్రోలు రూ. 40కే ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని అడిగారు. విద్యార్థినులకు స్కూటి ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News