ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంఎల్‌సి కవితకు చుక్కెదురైంది. కవితకు స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇడి, సిబిఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. గత నెలలో రెండు పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఇడి అధికారులు మార్చి 15న అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె, తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రౌస్ అవెన్యూ కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితతో పాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అనేక మంది మద్యం వ్యాపారస్తులు అరెస్టయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టయ్యారు. ఆయన బెయిల్ కోసం అర్జీ పెట్టుకోగా ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 9న కొట్టేసింది. లోక్ సభ ఎన్నికల వేళ తనపై రాజకీయ కక్ష సాధిస్తున్నారన్న ఆయన వాదనను కోర్టు తిరస్కరించింది. అయితే శుక్రవారం సుప్రీం కోర్టు కేజ్రీవాల్ వినతి విషయంలో స్పందించింది. ఆయన తాత్కాలిక బెయిల్ వాదనలను మే 7న పరిశీలిస్తామని తెలిపింది.