మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళా దినోత్సవం రోజున
పార్లమెంట్ ముందుకు తీసుకురావాలి
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి
ఇప్పటికే రెండుసార్లు బిజెపి మాట తప్పింది
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష
పెద్ద ఎత్తున మహిళలు తరలిరావలి:ఎమ్మెల్సీ కవిత పిలుపు
హైదరాబాద్: మహిళా దినోత్సవం రోజున మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత గురువారం మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో రెండు సార్లు హామీ ఇచ్చి మాట తప్పుతుందని కవిత మండిపడ్డారు. ఇందుకు నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామని ఆమె తెలిపారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. మార్చి 13 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని, ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి 2019లో మాట తప్పిందన్నారు. ఇంకా కేవలం మూడు పార్లమెంట్ సమావేశాలు మాత్రమే ఉన్నాయని, కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఆమె సూచించారు. జనాభా గణన చేయకపోవడం ఇంకా దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో ఓబిసి జనాభాను ప్రత్యేకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కవిత సూచించారు.
2026 నాటికి లింగ సమానత్వ లక్ష్యాలను….
తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తి పెంపొందించాలన్న లక్ష్యంతో పని చేసి తమ సంస్థ, నేడు దేశవ్యాప్తంగా కూడా అదే పని చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని ఆమె గుర్తుచేశారు. మహిళలు రాజకీయ రంగంలో ముందు ఉండాలంటే రిజర్వేషన్‌తోనే సాధ్యమవుతుందని భారత్ జాగృతి విశ్వసిస్తుందని ఆమె తెలిపారు. మార్చి 8వ తేదీన హోళీ పండుగ ఉన్నందును మార్చి 10 న ఢిల్లీలో దీక్ష చేస్తున్నామని, మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. 20 ఏళ్ల క్రితం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దేశాలు 2026 నాటికి లింగ సమానత్వ లక్ష్యాలను చేరుకుంటాయని ఆమె తెలిపారు. కానీ రిజర్వేషన్ కల్పించని భారత్ వంటి దేశాలు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2063 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇందులో రాజకీయమేమీ లేదని, సగం జనాభాను ఇంట్లో కూర్చోబెట్టి దేశాన్ని సూపర్ పవర్, విశ్వగురువు గా చేయలేరని ఆమె విమర్శించారు.
రాజ్యాంగబద్దంగా ఉపకోటా ఉండాలి
రాజకీయ రంగంలో మహిళలు ముందడుగు వేయాలంటే భారత్ లాంటి దేశాల్లో రిజర్వేషన్ ఉంటేనే సాధ్యమవుతుందన్నారు కవిత పేర్కొన్నారు. 2010 లో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో పాస్ అయినప్పుడు కొన్ని పార్టీలు ఉపకోటా ఉండాలని డిమాండ్ చేశాయని, ప్రతి ఒక్కరికీ వారి జనాభా ప్రకారం రాజ్యాంగబద్దంగా ఉపకోటా ఉండాలన్నది తమ కోరిక అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పోలీసుల అనుమతి ప్రకారం మార్చి 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళలతో కలిసి జంతర్ మంతర్‌లో దీక్ష చేస్తామని ఆమె తెలిపారు. 1992 లో 72 వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారని, 1993 లో 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు పట్టణ స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ప్రస్తుతం 21 రాష్ట్రాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఇప్పటికీ 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు గాను పార్లమెంటులో బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని సిఎం కెసిఆర్ గతంలోనే ప్రకటించడంతో పాటు, మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రత్యామ్నాయాలు కూడా సూచించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. పార్లమెంట్ ఎంపిల సంఖ్యను 33 శాతం పెంచి మహిళలకు కేటాయించాలని గతంలో సీఎం కెసిఆర్ సూచించారని కవిత తెలిపారు. 1952 లో మొదటి లోక్ సభలో 24 మహిళా ఎంపీలు ఉండగా, ప్రస్తుతం 78 మహిళా ఎంపీలు ఉన్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మహిళల ప్రాతినిథ్యం అనుకున్నంతగా లేదన్నారు.
అదానీ కుంభకోణంపై ఎందుకు విచారణ…
మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదించగలిగిన బిజెపి ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నేతల మీద కేంద్ర విచారణ సంస్థలతో విచారణ చేయిస్తున్న బిజెపి, అదానీ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని, అదానీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే గ్యాస్ సిలిండర్ల ధరలను బిజెపి ప్రభుత్వం పెంచిందా అని ఆమె ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతోనే అదానీపై విచారణ మొదలైందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికల సంఘం బిజెపి, మోడీ కబంధ హస్తాల నుంచి బయటపడిందన్నారు. గతంలో జరిగిన సంఘటనలు చూస్తే, ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడం లేదన్న ఆరోపణలు ఉన్నయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణలో మహిళల రక్షణపై బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాజీపడడం లేదని, నిందితులు ఎలాంటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, జాగృతి ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.