Thursday, January 23, 2025

వాంగ్మూలం నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితపై సిబిఐ విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి కవిత ఇంట్లోనే సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. రెండు బృందాల్లో వచ్చిన సిబిఐ అధికారులు దాదాపు ఏడున్నరగంటల పాటు సుదీర్ఘంగా విచారించి, ఆమెనుంచి వివరాలు సేకరించారు. సిఆర్‌పిసి 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. సిబిఐ వివరణ ముగించుకున్న కవిత అనంతరం న్యాయనిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది.

అనంతరం కవిత తన నివాసం నుంచి బయటకు వచ్చి నేతలకు, కార్యకర్తలకు ‘విక్టరీ’ సింబల్ చూపుతూ అభివాదం చేశారు. అక్కడ్నించీ మీడియాతో మాట్లాడకుండానే మంత్రి తలసానితో కలిసి ఆమె నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు.సిబిఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటివద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిబిఐకు కవిత వివరణ సందర్భంగా కార్యకర్తలు, నేతలు ఎవ్వరూ రావొద్దని బిఆర్‌ఎస్ ఆదేశించింది.

దీంతో ఆదివారం ఉదయం నుంచి కవిత నివాసానికి వెళ్లే మార్గమంతా నిర్మానుష్యంగా మారింది. మరోవైపు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలపై ఎంఎల్‌సి కవితను సిబిఐ అధికారులు వివరణ కోరినట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఇడి ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ కంట్రోలర్‌గా కవిత ఉన్నారని ఇడి తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు ఇచ్చేందుకు రూ.100 కోట్లను విజయ్ నాయర్‌కు అందినట్లు సిబిఐ, ఇడి ఆరోపణలు చేస్తున్నాయి. ఎంఎల్‌సి కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో సిబిఐ పేర్కొంది. ఈ అంశంపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంతో మీకు ఉన్న సంబంధాలేమిటి?, ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఉందా?, అమిత్ అరోరా మీకు తెలుసా? అమిత్ అరోరాతో ఉన్న సంబంధం ఏమిటి?, అమిత్ అరోరా కాల్‌లిస్ట్‌లో మీ నంబర్ ఎందుకు ఉంది? సౌత్ గ్రూప్‌లో మీ పాత్ర ఉందా? అమిత్ అరోరా మీ పేరు ఎందుకు చెప్పారు?, విజయ్ నాయర్ మీకు తెలుసా? విజయ్ నాయర్‌కి రూ.100 కోట్ల తరింపులో మీ పాత్ర ఉందా? లిక్కర్ పాలసీ, లిక్కర్ తయారీ కంపెనీలకు అనుకూలంగా రూపొందించడంలో మీ పాత్ర ఉందా? ఢిల్లీలో ఎక్సైజ్ శాఖ అధికారులను కలిశారా?, లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీరు భాగస్వామిగా ఉన్నారా? అమిత్ నాయర్, విజయ్ నాయర్‌తో ఉన్న సంబంధం ఏమిటీ?, సౌత్ గ్రూప్ కంట్రోలర్‌గా మీరు ఉన్నారా? తదితర ప్రశ్నలను సంధించినట్లు సమాచారం.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆమెను సాక్షిగా మాత్రమే విచారించారు. ఇంతటితో విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారిస్తారా? అనే దానిపై సిబిఐ అధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. కాగా, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6-30 గంటల వరకు ఏకబిగువన ఏడున్నర గంటల పాటు సిబిఐ అధికారులు కవితను విచారించడంలో అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో కవిత నివాసానికి భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా మహిళ విచారణ సందర్భంలో సూర్యాస్తమయం లోపు విచారణ పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ కవితను సూర్యాస్తమయం దాటిన విచారణను కొనసాగించడంలో కార్యకర్తలు, నేతల్లో ఆందోళనతో కూడిన ఉత్కంఠ మొదలైంది.

సిబిఐ అధికారులు నివాసాన్ని వీడే సమయంలోనూ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినదించారు. ఇక సిబిఐ అధికారులు వెళ్లిన అనంతరం నేతలు, కార్యకర్తలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. కాగా, ఈ కేసులో కవిత విచారణ కోసం ఆరో తేదీని సూచిస్తూ కవితకు సిబిఐ మొదటి లేఖను రాయగా, ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11,12,14,15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ఆమె ప్రత్యుత్తరం రాశారు. దీంతో సిబిఐ ఆదివారం విచారిస్తామని సమాచారం ఇవ్వగా, కవిత అంగీకరించారు. ఈ క్రమంలోనే ఆదివారం కవిత ఇంటికి సిబిఐ అధికారులు వచ్చారు. మరోవైపు శనివారం ఆమె ప్రగతిభవన్‌కు వెళ్లి సిఎం కెసిఆర్‌ను కలిశారు. మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత కవితతో సిఎం కెసిఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

రాజకీయ కక్షతో ఇబ్బందులు పెట్టేందుకు బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవని, సిబిఐ విచారణ దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నట్లు తెలిపింది. సిబిఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు తెలిసింది. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కవిత ఇంటి ఎదుట బిఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యోధుని కుమార్తె ఎప్పటికీ భయపడబోదనే అర్థం వచ్చేలా ‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’ అని ఫ్లెక్సీలు పెట్టారు. మరోవైపు ఈ విషయంలో ఇప్పటికే కవిత పలువురు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. సిబిఐ వివరణ ముగిసినానంతరం కూడా కవిత న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది.
రాజకీయ నేతల స్పందన
కవితపై సిబిఐ విచారణ చేపట్టడంపై పలువురు రాజకీయ పార్టీల నేతలు స్పందించారు. సిబిఐ విచారణను లైవ్ కాస్టింగ్ ఇవ్వాలని సిబిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కోర్టులే కేసుల విచారణను లైవ్ ప్రసారం చేస్తుంటే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు లైవ్ ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. మరోవైపు కవితపై సిబిఐ విచారణను బహిరంగంగా జరపాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర సర్కార్, ఇడి, ఐటి, సిబిఐ పేరుతో ప్రాంతీయ పార్టీ నేతలను బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News