అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంటపడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. ప్రభుత్వంలో జరిగే తప్పులను తెలంగాణ జాగృతి సంస్థ ఎప్పటికప్పుడు ఎత్తిచూపిస్తుందన్నారు. బుధవారం నాడు తన నివాసంలో జరిగిన తెలంగాణ జాగృతి వరంగల్, నల్గొండ జిల్లాల నాయకుల సమావేశంలో ఎంఎల్‌సి కవిత ప్రసంగించారు. ముఖ్యమంత్రి తమకు ఏదో చేస్తారన్న విశ్వసం ప్రజల్లో లేదని అన్నారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
నెలకు రూ. 2500 చొప్పున రూ. 30 వేలు ఒక్కో మహిళకు సిఎం బాకీ ఉన్నారని చెప్పారు. రూ. 2 వేలు పెన్షన్ పెంచామని చెప్పారు కానీ పెంచలేదని, ఆ మొత్తం కూడా ఒక్కొక్కరికి రూ. 24 వేలు సీఎం బాకీ పడ్డారని, వీటన్నింటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసినప్పుడే తెలంగాణ తల్లికి నిజమైన నివాళి అర్పించినవాళ్లవుతారని స్పష్టం చేశారు.తెలంగాణ తల్లి రూపురేఖలు మార్పు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ప్రజల పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించడం, ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే తెలంగాణ సంస్కృతి అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదు
కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ చేతిలో ఉండేదని, ఇప్పుడు అక్కడ కేంద్ర బలగాలు మోహరించాయని తెలిపారు. నరసింహావతారంలా పేగులు మెడల వేసుకుంటా అని సిఎం అంటున్నారు కదా..? నిజంగా ధైర్యం ఉంటే నాగార్జున సాగర్ వద్ద నరసింహావతారం ఎత్తి కేంద్ర బలగాలను వెనక్కి పంపించి మన నీళ్లు మనకు తీసుకురావాలని సవాలు చేస్తున్నానని వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంటే సిఎం రేవంత్ రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు.
ఏ హస్టల్‌లో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగి చనిపోయినా అక్కడికి వెళ్లి ఆ అన్యాయాన్ని ప్రశ్నించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్న సామాజిక మార్పులను పరిగణలోకి తీసుకొని బిసిలకు రాజకీయ ప్రాతినిధ్యం అంశాన్ని తీసుకున్నామని వ్యాఖ్యానించారు. గతంలో ప్రారంభించిన కార్యచరణను ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. అనేక వర్గాల నుంచి తమకు మద్ధతు వస్తోందని చెప్పారు. కెసిఆర్ స్పూర్తితో, ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పడిందని ఎంఎల్‌సి కవిత తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా అనేక సామాజిక అంశాలపై తెలంగాణ జాగృతి ఉద్యమించిందని అన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పోరాడి సాధించామని గుర్తు చేశారు. 16 రాజకీయ పార్టీలను ఒప్పించి మహిళా రిజర్వేషన్ చట్టం సాకారం కావడానికి కృషి చేశామని స్పష్టం చేశారు.