Sunday, December 22, 2024

రాష్ట్రంలో మరో 30 యేళ్ల వరకు సింగరేణికి ఢోకా లేదు..

- Advertisement -
- Advertisement -

మరో 30 ఏళ్ల వరకు సింగరేణికి ఢోకా లేకుండా చేశామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 130 ఏళ్ల చరిత్ర గల సింగరేణి అనేక మందికి పొట్టనింపిందని అన్నారు. తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేస్తూ వెలుగులు నింపుతోందన్నారు. సంస్థ ఎదిగితే దాని కింద వేలాది మంది జీవిస్తారన్నారు. గతంలో ఇవే బొగ్గు బాయిలు అన్నం పెట్టాయన్నారు.

అట్లాంటి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని సిఎం కెసిఆర్ ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు. దేశం మొత్తం ఒకలా ఉంటే తెలంగాణలో మాత్రం కొత్త చరిత్ర రాస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నదని, సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉద్యోగుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణలో మాత్రం మనం కచ్చితంగా సింగరేణిని కాపాడుకుంటున్నామన్నారు.

1998లో చంద్రబాబు విజన్ 2020 పేరిట డాక్యుమెంట్ తెచ్చారని.. విజన్ 2020 అంటే సింగరేణి సంస్థ ఉద్యోగాలను కేవలం 20 వేలకు కుదించి దీన్ని నిర్వీర్యం చేసి తర్వాత ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రకు ఆనాడు తెరలేపారన్నారు. కానీ దాన్ని మనం బద్ధలు కొట్టి కార్మికులను కాపాడుకొని రిటైర్ మెంట్ దగ్గర ఉన్న వాళ్ల పిల్లలకు 18 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సంస్థను కాపాడుకోడానికి రాజకీయ చిత్తశుద్ధి, దక్షత ఉండాలన్నారు.

ఆ రెండు ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్ అని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టులకు వెళ్లి అడ్డంపడిన దగుల్భాజీలు ఎవరన్నది ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ కాళ్లలో కట్టెలు పెడితే….అది ఆయనకు నష్టమా? లేదా? తెలంగాణకు నష్టమా? అన్నది ఆలోచించాలని సూచించారు. కోల్ ఇండియాకు మించి సింగేణిలో ప్రయోజనాలను కల్పిస్తున్నామని కవిత స్పష్టం చేసారు. ఏ ఒక్క విషయంలో కూడా కోల్ ఇండియా కంటే తక్కువ చేయడం లేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News