మాణికం ఠాగూర వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంఎల్‌సి కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణికం ఠాగూర్ వ్యాఖ్యలకు టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదన్న కవిత.. మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కోసం కెసిఆర్, టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇది గిఫ్ట్ కాదు అని కవిత తెలిపారు. నిజమైన పోరాటం గెలిచిందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎంపి రాహుల్‌గాంధీపై అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. రాజకీయాలకు అతీతంగా రాహుల్‌గాంధీకి అండగా నిలబడ్డారన్నారు. తొలుత మాణికం ఠాగూర్.. తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ కాంగ్రెస్ టీమ్.. కోట్లాది మంది తెలంగాణ యువత, సోనియమ్మ కోరుకున్న తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఏడేళ్లలో అలా జరగలేదు.
అది నెరవేరాలంటే ఊసరవెల్లి టిఆర్‌ఎస్, మతతత్వ బిజెపిని ఓడించాలి. ఈ రెండు పార్టీలు ఒకే నాణానికి రెండు పార్శాలు. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయగలదు’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కవిత.. తెలంగాణ కోసం కెసిఆర్, టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదని తెలిపారు. భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకతీతంగా ముఖ్యమంత్రి కెసిఆర్.. కాంగ్రెస్ ఎంపి రాహుల్‌గాంధీకి అండగా నిలబడ్డారు. అది కెసిఆర్ స్థాయి, గొప్పతనం అని కవిత పేర్కొన్నారు. దయచేసి ఇంకోసారి కెసిఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని ఠాగూర్‌కు కవిత సూచించారు.