పూలే పేరుతో రాజకీయం పబ్బం గడపడం సరికాదు : బిజెపి నేత రఘనందన్‌రావు
మన తెలంగాణ/హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదని మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. గురువారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవితకు మహాత్మా పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా బిసిలను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఒక ఎంపీ సీటు తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఇవ్వమని తన తండ్రిని అడగాలని సూచించారు. సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికీ తెలుసునని, మీ నాన్న ఆరోగ్యం బాగోలేనందున్న బిఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా సీనియర్ అయిన, దళితుడు అయిన కడియం శ్రీహారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాజ్యాలు విస్తరించుకునే పనిలో ఉన్నారని, ఆయనకు సినిమా వాళ్ళతో పనులుంటాయని ఎద్దేవా చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఒక బిసికి ఇవ్వాలని, శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి మీ పాపాలు కడుకుని పునీతులు కావాలని సూచించారు.
నీకు, మీ కుటుంబానికి ఇంకా పబ్లిసిటీ పిచ్చి ఎందుకు అని విమర్శించారు. శాసనసభలో మీ అన్న, మీ బావ కనపడాలి తెలంగాణ భవన్‌లో మీ తండ్రి కనపడాలి, మండలిలో నువ్వు కనిపిస్తావు, మీరు తప్ప మాట్లాడే వాళ్ళు మీ పార్టీలో లేరా? అని ప్రశ్నించారు. కొద్ది రోజులు మీరు, మీ కుటుంబ సభ్యులు మాట్లాడకుండా, మీడియా ముందుకు రాకుండా ఉంటే మీకే మంచిదని హితువు పలికారు. మీ పార్టీ పేరులో తెలంగాణ పోయిందని, కనీసం సీట్లు అయినా తెలంగాణ కోసం కొట్లాడిన వారికి ఇవ్వాలని సూచించారు.