Thursday, December 19, 2024

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టొద్దు : ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

మెట్‌పెల్లి: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే ప్రజల బతుకులు బాగుంటాయని చెప్పారు. బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ప్రజలు గెలుస్తారని, బిజెపి, కాంగ్రెస్ పార్టీలను గెలిపిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తాయని అందుకే కారు గుర్తుకు ఓటేసి బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి కవిత బండలింగాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ గ్రామాల్లో చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయని తెలిపారు. చెరువు ఎండిపోయినప్పుడు చెరువును విడిచిపెట్టి కప్పలు వెళ్లిపోతాయని కానీ చేపలు మాత్రం చెరువు నిండినా ఎండినా అక్కడే ఉంటాయన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ వాళ్లు చేపల్లాంటి వాళ్లని, కాంగ్రెస్, బిజెపి వాళ్లు కప్పల వంటి వాళ్లని అన్నారు. తెలంగాణ కోసం బిజెపి ఎప్పడూ మాట్లాడలేదని సిఎం కెసిఆర్ దీక్ష చేసేంత వరకు ఒక్కరు మాట్లాడలేదని విమర్శించారు. వాళ్ల మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. చెరువులు ఎండిన నాడు ప్రజలతో బిఆర్‌ఎస్ ఉందని, ఇప్పుడు చెరువులు నిండిననాడు కూడా ప్రజలతోనే బిఆర్‌ఎస్ ఉందని వివరించారు. కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉంటేనే మనవాడు అవుతారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం కెసిఆర్‌దేనని, బీడీ కార్మికుల పెన్షన్లకు కటాఫ్ డేట్ తీసేస్తామని సిఎం కెసిఆర్ అన్నారని, కాబట్టి ఎన్నికల తర్వాత బీడీ కార్మికులందరికీ పెన్షన్లు వస్తాయని చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విపరీతంగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచితే దాన్ని తగ్గించడానికి సీఎం కెసిఆర్ కృషి చేశారని, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రూ. 400 కే సిలిండర్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో దక్షిణ భారత దేశంలో తొలిసారి హ్యాట్రిక్ సిఎం అయ్యి కెసిఆర్ రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంజయ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత, ఎంపీపీ సాయి రెడ్డి, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News