Wednesday, January 22, 2025

43 శాతం నేర చరితులే ముద్దు!

- Advertisement -
- Advertisement -

ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దైవత్వం వెల్లివిరుస్తుంది! మన గడ్డ అలాంటిదే మరి అంటూ తెగ మురిసిపోతాం. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం!! అని మన జబ్బలు మనమే చరుచుకుంటాం. ఎంతటి ఆత్మవంచన! ఇంకా ఇలాంటివే చెప్పుకోవాలంటే మరో రామాయణం, భారతాలు అవుతాయి. దేశంలో పరిస్థితి అలానే ఉందా? ఆమె దీక్ష తెర వెనుక కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే తెర ముందు రాజకీయ పార్టీలు తమ వైఖరిని తేల్చాలంటూ భారత జాగృతి సంస్థ నేత, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చారు. కవిత జన్మించటానికి నాలుగు సంవత్సరాల ముందే 1974లో ఈ సమస్య ముందుకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆమె తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పుట్టక ముందు నుంచే నలుగుతోంది. దీనికి సంబంధించి రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన బిల్లును 108వ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు.

అప్పటి నుంచి 2014, 2019లో రెండు లోక్‌సభల గడువు తీరి రద్దయి ఉనికిలోకి వచ్చిన మూడవ సభలో కూడా ఇంత వరకు ఆమోదం పొందలేదు, ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. వర్తమాన లోక్‌సభ 2024లో రద్దయేలోగా ఆమోదం పొందుతుందా? ఆ ప్రక్రియ తరువాత రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఐదున్నర గంటల పాటు భారీ ఎత్తున మద్దతుదార్లతో కలసి కవిత దీక్ష చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె. నారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. లాంఛనప్రాయమైన ఈ దీక్ష ద్వారా మరుగున పడేసిన ఈ అంశాన్ని ఆమె ఒక్కసారి దేశ దృష్టిని ఆకర్షించేట్లు చేశారు. దీని పర్యవసానాలు ఏమిటి?

మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన వచ్చినపుడు రాజ్యాంగ సభ లేదా పరిషత్‌లోని కొందరు పురుషులతో పాటు కొందరు మహిళా సభ్యులు కూడా అంగీకరించలేదు. నిజానికి ఈ అంశం 1931లోనే చర్చకు వచ్చింది. మహాత్మా గాంధీ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. 1931లో నాటి బ్రిటిష్ ప్రధానికి సరోజిని నాయుడు తదితరులు రాసిన లేఖలో చట్టసభల్లో మహిళల నియామకం, రిజర్వేషన్లు, కో ఆప్షన్ వంటి చర్యలను అవమానకరమైనవిగానూ, హానికరమైనవిగానూ పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. తరువాత కాలంలో దీన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. చట్టసభలలో ఆశించిన మేరకు ప్రాతినిధ్యం పెరగలేదు.

1974లో దేశంలో మహిళల స్థితిగతుల గురించి ఒక కమిటీ చేసిన సిఫార్సులలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒకటి. చట్ట సభల్లో రిజర్వేషన్లను తిరస్కరించింది. అప్పటి నుంచి ఈ డిమాండ్‌కు క్రమంగా మద్దతు పెరిగింది. తరువాత 1988లో జాతీయ మహిళా దృష్టికోణ పథకం (నేషనల్ పరస్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్) కమిటీ స్థానిక సంస్థలలో మహిళలకు 30 శాతం స్థానాలను రిజర్వు చేయాలని సిఫార్సు చేసింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1992, 93 సంవత్సరాలలో 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా మూడో వంతు స్థానాలను రిజర్వు చేశారు. దీని ప్రకారం మూడవ వంతు కనీసంగానూ, తరువాత ఏ రాష్ర్టమైనా కోరుకుంటే 50 శాతం వరకు కూడా పెంచుకొనే అవకాశం కల్పించారు. ఆ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఆమేరకు సగం సీట్లు రిజర్వు చేశాయి.

తరువాత 1996 సెప్టెంబరు 12న దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడు లోక్‌సభలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. అది వీగింది, తరువాత ప్రతి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టటం ఆమోదం పొందకుండానే సభలు రద్దు కావటం చరిత్రగా మిగిలింది. తరువాత 2008లో యుపిఎ సర్కార్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. స్టాండింగ్ కమిటీకి పంపగా దాన్ని ఆమోదించాలని 2009 డిసెంబరులో సిఫార్సు చేసింది. మంత్రివర్గం 2010 ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. మార్చి తొమ్మిదవ తేదీన ఓటింగ్‌కు పెట్టగా 199 1తో ఆమోదం తెలిపారు. తరువాత లోక్‌సభ, సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలిపి ఉంటే అది చట్ట రూపం దాల్చి ఉండేది. ఇంతవరకు అది జరగలేదు. రాజ్యసభ ఆమోదించినదాని ప్రకారం మూడో వంతు సీట్లు అంటే 543కు గాను 181 స్థానాల్లో మహిళలు ఉండాలి.

వర్తమాన లోక్‌సభలో 78 మంది అంటే 14.3 శాతం మాత్రమే ఉన్నారు. మంత్రులు కూడా ఇదే దామాషాలో కొలువు దీరారు. అంతకు ముందు ఉన్నవారి కంటే మంత్రుల సంఖ్య తగ్గింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం తొమ్మిది శాతమే ఉన్నారు. వివిధ దేశాల పార్లమెంట్లలో ఉన్న మహిళా ప్రాతినిధ్యం గురించి అంతర పార్లమెంటరీ యూనియన్ 2022లో సేకరించిన సమాచారం ప్రకారం సగానికిపైగా, దగ్గరగా మహిళలున్న పార్లమెంట్లు ర్వాండా (61.25) , క్యూబా ( 53.22), బొలీవియా (53.08), న్యూజిలాండ్ ( 50.42), యుఎఇ (50), మెక్సికో (48.2), నికరాగువా (47.25) ఉన్నాయి. ఇరవై దేశాలలో 40 శాతంపైగా, ప్రపంచ వ్యాపితంగా సగటున 26 శాతం ఉన్నారు. 2020లో ప్రపంచంలో 193 దేశాలలో మన స్థానం 143 కాగా మన కంటే మెరుగ్గా ఉన్న దేశాలు నేపాల్ 43, బంగ్లాదేశ్ 98, పాకిస్థాన్ 106వ స్థానంలో ఉండగా శ్రీలంక 182 వదిగా ఉంది.

మన పార్లమెంటులో రిజర్వేషన్ల బిల్లు చర్చకు వచ్చినపుడు ఒబిసి, దళిత, గిరిజన మహిళల భుజాల మీద తుపాకి పెట్టి బిల్లును అడ్డుకున్న ఘనులు ఉన్నారు. ఏ సామాజిక తరగతికి చెందిన వారు అన్నదానితో నిమిత్తం లేకుండా మొత్తంగా మహిళలు అన్ని సామాజిక తరగతుల్లో వివక్షకు గురవుతున్నారు. అందువలన రిజర్వేషన్లు పెడితే ధనికులు, మనువు చెప్పిన దాని ప్రకారం ఎగువ నిచ్చెన మెట్ల మీద ఉన్న మహిళలే ఆ ఫలాలను అనుభవిస్తారంటూ అడ్డుకున్నవారు కొందరు. రిజర్వేషన్లు అడగటం, ఇవ్వటం అంటే మహిళలను కించపరచటమే అని వాదించిన వారూ లేకపోలేదు. పైకి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ దేశంలో ఫ్యూడల్ భావజాలం బలంగా ఉండటమే బిల్లు ఆమోదం పొందటానికి ఆటంకంగా ఉందని చెబుతున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికైన మహిళలు పేరుకు ఆ స్థానాల్లో ఉన్నా భర్త లేదా కుటుంబంలోని ఇతర పురుషులే పెత్తనం చేస్తున్నారన్నది కూడా పాక్షిక సత్యమే. మరో వైపున మహిళలు ఉన్న చోట కేటాయింపులు పౌర సేవలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలకు పెరిగినట్లు, సాధికారత, ఆత్మగౌరవం పెరిగినట్లు కూడా సర్వేలు వెల్లడించాయి. గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ చట్టసభలకు పోటీ చేసే వారిలో నిర్ణీత శాతంలో మహిళలు ఉండేట్లు చూడాలన్న ప్రతిపాదనకు ఆమోదం రాలేదు. దీని వలన ఓడిపోయే చోట్ల వారిని పోటీకి దింపుతారనే విమర్శ కూడా వచ్చింది.

ఎన్నికల నిబంధనావళి ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తిపాస్తులు, తమ మీద ఉన్న కేసులను అఫిడవిట్లలో పేర్కొనాల్సి ఉంది. వాటిని విశ్లేషిస్తున్న ఎడిఆర్ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో నేర చరితులు 43 శాతం మంది ఉన్నారు. లోక్‌సభలోని 539 మందిలో 233 మంది నేరచరితులు ఉన్నట్లు తేలింది. పార్టీలవారీగా బిజెపి 116 (39శాతం), కాంగ్రెస్ 19 (57 శాతం), జెడియు 13 (81శాతం), డిఎంకె 10 (43శాతం) తృణమూల్ 9 (41) మంది ఉన్నారు. గత మూడు ఎన్నికలలో 2009లో మొత్తం 162 (30 శాతం) నుంచి 2014లో 185 (34 శాతం), 2019లో 233(43 శాతం)కు పెరిగారు. వర్తమాన సభలో నేర చరితుల మీద ఉన్న కేసులలో 29 శాతం అత్యాచారం, హత్య, హత్యాయత్నం, మహిళల మీద నేరాల వంటి తీవ్ర స్వభావం కలిగినవి ఉన్నాయి. బిజెపికి చెందిన ఐదుగురు, బిఎస్‌పి నుంచి ఇద్దరు, కాంగ్రెస్, ఎన్‌సిపి, వైఎస్‌పి, ఒక స్వతంత్రుడి మీద హత్య కేసులు, బిజెపి ఎంపి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మీద ఉగ్రవాద కేసు ఉంది. ఆమె భోపాల్ నుంచి గెలిచారు, మాలెగావ్ పేలుడు కేసులో నిందితురాలు. ఇక 29 మంది తమ మీద విద్వేష పూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

అత్యధికంగా కేరళలోని ఇడుక్కి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపి డీన్ కురియకోస్ మీద దొంగతనంతో సహా 204 కేసులు గరిష్టంగా ఉన్నాయి. ఇలాంటి వారిని కలిగి ఉన్న పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి ఏకాభిప్రాయానికి రావటం లేదన్నది ఒక ఆరోపణ. నిజానికి ఏ పార్టీ రంగేమిటో తేలేది బిల్లును లోక్‌సభ ముందుకు తెచ్చినపుడే. గతంలో తమకు ఉభయ సభల్లో మెజారిటీ ఉంటే ఒక్క క్షణంలో చేసి ఉండేవారమన్నట్లుగా బిజెపి నేతలు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పటికీ బిజెపి నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి చొరవలేదు. 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్న ప్రశ్నకు ఆ ఏడాది డిసెంబరులో నాటి మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇచ్చిన సమాధానం బిజెపి చిత్తశుద్ధిని వెల్లడించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధనను జాగ్రత్తగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి చొరవ ఇంత వరకు ఎందుకు తీసుకోలేదన్నదే ప్రశ్న. తాము అనుకున్న కశ్మీరు రాష్ర్ట రద్దు, ఆర్టికల్ 370 రద్దును ఆగమేఘాల మీద ఎలా ఆమోదం పొందారో తెలిసిందే. అందువలన ఇప్పుడు బిజెపి తలచుకుంటే ఆమోదం కష్టమా ?

ఎం కోటేశ్వరరావు- 8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News