Thursday, January 23, 2025

అర్వింద్.. 24 గంటల సమయం ఇస్తున్నా: కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : బిజెపి ఎంపి అర్వింద్ తనపై చేస్తున్న ఆరోపణలను 24 గంటల్లో రుజువు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని అర్వింద్‌ను డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్బన్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఎంపి అర్వింద్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే బాగుండదని హెచ్చరించారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పని చేస్తోందని అందుకే ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని తెలిపారు. గతంలో పాలించిన గతంలో అధికారంలో ఉన్న వారు కమిషన్‌లకు కక్కుర్తి పడేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. నిజామాబాద్ నగరంలో రింగ్ రోడ్డును పూర్తి చేయలేకపోయారని అన్నారు. తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు వెంటబడి పరిష్కరిస్తే నిర్మాణం పూర్తయిందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీంలో డబ్బులు ఎవరు, ఏ కుటుంబం తిన్నదో నిజామాబాద్ ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు.

అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తున్న, నాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చారో రుజువు చేయాలి. కాగితం పట్టుకురా… లేకపోతే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని సవాల్ విసిరారు. తన తండ్రిని అంటే వదిలేశామని, ఇప్పుడు తన భర్తను కూడా విమర్శిస్తున్నారని, ఎవరూ ఊరుకోరని, మజాక్ చేస్తే బాగుండదని హెచ్చరించారు. రాజకీయాల్లో లేని తన భర్త పేరును ఎందుకు తీస్తున్నారని అర్వింద్‌ను నిలదీశారు. చౌకబారు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసిన అక్కడికి వెళ్లి ఆయనను ఓడించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని తేల్చి చెప్పారు. మణిపూర్ అల్లర్లపై నిరుద్యోగంపై బిజెపి నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు. రైతుబంధు పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఎస్‌ఆర్‌ఎస్పి పునరుద్దరణ ప్రాజెక్టులో బిజెపిది ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ లేదని చెప్పారు.

జాతీయ రహదారులపై గుంతలు ఉంటాయా ఎక్కడైనా ? ఏం చేస్తున్నాడు గడ్డిపీకుతున్నాడా ? అని అర్వింద్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అన్ని విషయాలపై నిలదీస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అర్వింద్ ఏం తెచ్చారని నిలదీశారు. అబద్దాల మీద సమాజం నడవదని సూచించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడమే బిజెపి ఎజెండా అని ఆరోపించారు. రైతులు బిఆర్‌ఎస్ పార్టీకి ఒటేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారని, రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యాపారవేత్తలకు కూడా మూడు గంటలే సరిపోతుందని చెప్పగలదా అని ప్రశ్నించారు. పైసలు ఉన్న వారి పక్షాన మాత్రమే కాంగ్రెస్, బిజెపి పార్టీలు నిలబడుతాయని, బిఆర్‌ఎస్ ఎప్పుడూ పేదల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కాదు. మూడు గంటలు విద్యుత్ చాలని అంటారు. 25 గంటల కరెంటు ఇస్తామని అంటారు. అప్పుడే సోనియా గాంధీ దుయ్యబట్టారు. పావురాల గుట్టలో పావురంలా మాయమైపోండని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వైయస్ ఉచిత కరెంటు ఇచ్చిండని అంటారు. అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రైతుల పట్ల కాంగ్రెసఖ్ వైఖరి ప్రజలకు అర్థమైందని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ సాయం చేయదన్న ఆలోచన ప్రజల్లో వచ్చిందన్నారు. ధరణిని రద్దు చేఇ దళారులను ప్రవేశ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ఆరోపించారు. ధరణి వల్ల భూవివాదాలు సమసిపోయాయని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు.

ధరణి మా విధానం.. దళారి కాంగ్రెస్ విధానం అని విమర్శించారు. బిఆర్‌ఎస్, బిజెపికి డిఎన్‌ఏ మ్యాచ్ కాదని చెప్పారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరంలో ఉంటామని స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్ తోనే పోటీ అని, కానీ ఆపోటీ కూడా బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ దూర స్థానంలో ఉంటుందని స్పష్టం చేశారు. గతంకంటే భారీ మెజారిటీ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని అనేక సర్వేలు తేల్చాయని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News