Monday, December 23, 2024

కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడేందుకు సిద్దమయ్యారు: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : ఈసారి ఎన్నికలు తెలంగాణ ద్రోహులు.. తెలంగాణ ప్రేమికుల మధ్య జరుగుతున్నావని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సకల జనులు అంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని తేల్చి చెప్పారు. కుటుంబ పాలన గురించి ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై తిరగబడేందుకు ప్రజలు సిద్దమయ్యారని తెలిపారు. గురువారం ఆర్మూర్ నియోజక వర్గంలోని అంకాపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లేనిపోని ఆరోపణలు చేశారని, సత్య దూరమైన అంశాలను మాట్లాడారని అన్నారు. వాళ్లు చెప్పేవి చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ గాంధీ చదువుతున్నారని రాహుల్ గాంధీ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. కాలేశ్వరం, మిషన్ భగీరథ వ్యయం కలిపితే రూ. లక్ష కోట్ల లోపే ఉందని, రూ. లక్ష కోట్ల కంటే తక్కువ ఖర్చు చేసిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా చేస్తారన్నది ఆలోచించాలని సూచించారు.

ఏదిపడితే అది మాట్లాడితే ఓట్లు వస్తాయనుకోవడం అమాయకత్వమవుతుందన్నారు. నిజంగా అవినీతియే జరిగి ఉంటే మొత్తం తెలంగాణ రైతుల పొలాలకు నీళ్లు వచ్చేవి కావని, అవినీతి జరిగితే ఇంటింటికి తాగునీరు వచ్చేవి కావని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగింది. కాబట్టి ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు పూర్తి కావడానికి 60 ఏళ్ల సమయం పట్టిందని మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మొదలు పెట్టిన ప్రాజెక్టును కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సిఎం కెసిఆర్ పూర్తి చేసిన పరిస్థితి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క బెట్టకుండా పోరాటం చేసిన సిఎం కెసిఆర్ మీద అవాకులు చెవాకులు మాట్లాడడం ప్రజలు తట్టుకోలేకపోతున్నారని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. కమీషన్లు తీసుకుంటే చెరువులకు నీళ్లు రాకపతుండేనని, అలా చేసి ఉంటే కాంగ్రెస్ హయంలో రైతుల కళ్లకు కన్నీళ్లు వస్తుండేనని చెప్పారు. పారదర్శకంగా కష్టపడి పని చేశాము. కాబట్టి పొలాల్లో నీళ్లు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ అష్టకష్టాలు పడిందని, బలవంతంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కలపడం వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ హక్కుల గురించి రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా మాట్లాడలేదని కేంద్రం హామీలు అమలు చేయకపోతే, 7 మండలాలను ఏపిలో కలిపితే కూడా ఏనాడూ రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడలేదని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు గాజులు చేయిస్తానన్నట్లు ఇప్పుడు వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంట కానీ ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో ఇష్టంవచ్చినట్లు వాగ్దానం చేస్తున్నారని విమర్శించారు. మీవి దొంగ వాగ్దానాలు, అబద్దపు వాగ్దానాలు, ఆపద మొక్కుల వాగ్దానాలన్న విషయాన్ని ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. మోతిలాల్ నెహ్రూ కొడుకు జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ బిడ్డ ప్రియాంకా గాంధీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గ్లాస్ హౌజ్‌లో కూర్చొని ఇతరులపై రాళ్లు విసరరాదు. ఏం మాట్లాడుతన్నారో ఆలోచించుకొని మాట్లాడాలి అని వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపితే మరి భూమికి హక్కుదారులెవరో ఎలా తెలియాలి..? అని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా ఎలా రావాలె..? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ పొరపాటును అధికారంలోకి వస్తే ధరణి మాత్రం గ్యారెంటీగా గుళ్ల అవుతుందని, 24 గంటల నిరంతర విద్యుత్తు వచ్చే సమస్యే ఉండదని, గరిష్టంగా 5 గంటలకు మించి రైతులకు కరెంటు ఇవ్వలేమని కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి అన్నారని వివరించారు. అదే మన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కేవలం మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామంటున్నారని చెప్పారు. రైతులంటే కాంగ్రెస్‌కు ఎంత చిన్నచూపో అర్థం చేసుకోవాలని రైతులను కోరారు. సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంట్లో బతుకమ్మ సంబరాలలో పాల్గొని ముచ్చటించి పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News