Thursday, January 16, 2025

కాంగ్రెస్ రాజ్యమా.. ఖాకీల రాజ్యమా?: ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

జగిత్యాల :  రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా…లేక ఖాకీల రాజ్యమా అంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపైమ కేసులు బనాయించి వేధిస్తే సహించేదే లేదని, చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ఓ కేసులో జగిత్యాల సబ్ జైలులో ఉన్న బిఆర్‌ఎస్ నేత, హబ్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ ఎంఎల్‌ఎలు డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్ కుమార్‌తో కలసి గురువారం ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… అధికారం మారగానే సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కక్షపూరితంగా కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి అక్రమంగా సంబంధం లేని కేసులో ఇరికించి అరెస్టు చేయించి జైలులో పెట్టించారని ఆరోపించారు. గిత్యాల ప్రాంతం గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి కెసిఆర్ హయాంలో జరిగిందని, దానిని ఓర్వలేక తమ పార్టీ సర్పంచ్‌ను జైలులో వేయడం దారుణమని మండిపడ్డారు.

ఎంఎల్‌సి జీవన్ రెడ్డి కక్షపూరిత వైఖరితో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించడాన్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చట్టపరంగానే కాకుండా వీధుల్లో, ప్రజాక్షేత్రంలో తాము ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. తమ పార్టీ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నామని, ఏ పార్టీ కార్యకర్తలపై అయినా తాము రాజకీయంగా పోరాటం చేశాము తప్పా చట్టాన్ని, పోలీసులను వాడుకొని ఇలా కక్షపూరితంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్ రాజ్యమా… ఖాకీల రాజ్యమా అన్నట్లు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఉన్నదని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదని, ప్రజలు తిరగబడుతారని స్పష్టం చేశారు. అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలు కోసం పనిచేస్తూ హామీల అమలుకు ప్రయత్నం చేయాలని సూచించారు.

యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థినులను మహిళా పోలీసులు జుట్టుపట్టి లాగి పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణలో గతంలో ఎప్పుడూ పోలీసులు ఈ రకంగా వ్యవహరించలేదని చెప్పారు. ఉద్యమాలు, పోరాటాలు చేసి వచ్చిన బిఆర్‌ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అంతిమంగా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News