రాష్ట్రంలో పలు జిల్లాలో ఏ కారణం లేకుండానే తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎసి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి ఖమ్మం జిల్లా జైలుకు పంపించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్‌ఎస్ నాయకుడు, డిసిసిబి డైరెక్టర్ లక్కినేని సురేందర్‌ను శనివారం ఖమ్మం జైలులో ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. అక్రమ కేసులతో కెసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, కానీ కెసిఆర్‌ని, కెసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కొందరిని అరెస్ట్ చేస్తే కెసిఆర్‌ను అడ్డుకున్నట్టుగా కాంగ్రెస్ నేతలు భ్రమపడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా తమను ఆపలేరని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్ని, మోసాలన్నీ ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయని, రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయని అన్నారు.14 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అందరికీ తెలిసిపోయిందని, ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు రాలేదు, రైతు బీమా రాలేదు, పింఛన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్నీ దొంగ మాటలేనని గ్రామసభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు అక్కినేని సురేందర్‌పై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. ప్రభుత్వం నడపడం చేతగాక, పథకాలు అందించడం చేతకాక వైఫల్యాలను కప్పిపెట్టుకుంటామంటే కుదరదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు బిఆర్‌ఎస్ సైన్యం వారి వెంట పడుతూనే ఉంటుందని, అక్రమ కేసులకు తలొగ్గేదే లేదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు.
అక్రమ కేసులు, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదన్నారు. అక్రమ కేసులో అరెస్ట్ అయిన లక్కినేని సురేందర్, ఇతర నాయకులకు తమ పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రం లో పోరాడుతూనే ఉందామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్, మాజీ ఎంఎల్‌ఎలు బానోతు హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, మదన్‌లాల్, జెడ్‌పి మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దిండిగాల రాజేంద, ఆర్‌జెసి కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, బెల్లం ఉమ, పార్టీ ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణు, నిరోష తదితరులు పాల్గొన్నారు.