హైదరాబాద్: నిజామాబాద్ ఎంపి అరవింద్‌పై ఎంఎల్ సి కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు.‘ఇవాళ నేను బాధతో మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రజలు క్షమించాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నీతి, నిజాయితీ, ఒక పద్ధతి ఉంటుంది. సీఎం కెసిఆర్‌ని అనరాని మాటలు అంటున్నారు. నేను కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్ చెబుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది నువ్వు.
ఇంత వరకూ నేను ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోను. నా పుట్టుక, నా భవిష్యత్తు తెలంగాణ, టిఆర్‌ఎస్. బిడ్డా చెప్తున్నా.. గుర్తుపెట్టుకో. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెయ్ వెంటపడి ఓడిస్తాం’ అని అన్నారు. మరోవైపు ఎంఎల్ సి కవితపై ఎంపి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో గల అరవింద్ ఇంటిని జాగృతి, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు ముట్టడించారు.