Friday, December 20, 2024

రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

బోధన్: ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్లడం అక్కడ ప్రచారం చేసి రావడం రాహుల్ గాంధీకి పరిపాటిగా మారిందని ఆయన రాహుల్ గాంధీ కాదు అని ఎన్నికల గాంధీ అని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బుధవారం బోధన్‌కు వచ్చిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చిన రాష్ట్రానికి టూరిస్టుల వచ్చి వెళ్లడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని వచ్చి వెళ్తే తప్పులేదు కానీ ప్రశాంత వాతావరణంలో పాడు చేయవద్దని కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాకు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్నామని జిల్లాలో అంకాపూర్ చికెన్ తినవచ్చని డిచ్‌పల్లి రామాలయం టెంపుల్ చూడవచ్చని బోధన్‌కు వచ్చి అతిథ్యం స్వీకరించవచ్చని ఇక్కడి వాతావరణం మాత్రం చెడగొట్టవద్దని వ్యంగంగా విమర్శించారు.

ఇక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు అయినా కాలేశ్వరం ప్రాజెక్టును మూడున్నర ఏళ్ళలో పూర్తి చేశామని నీళ్లు వచ్చాయని ఈ ప్రాజెక్టును చూసి వెళ్ళవచ్చు అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలు గమనించాలని 2013, 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం విభజన జరిగితే పదేళ్ల కాలం నుంచి విభజన హామీలపై ఏనాడైనా రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రశ్నించారా ఆమె నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి రావలసిన వాటపై అడిగారా అని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర విభజనపై అనేక మాటలు మాట్లాడితే అక్కడే ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కనీసం అభ్యంతరం తెలుపలేదని మండిపడ్డారు. తెలంగాణలోని 10 మండలాలను ఆంధ్రలో కలిపితే కనీసం ప్రశ్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఐఐటి ఐఐఎం ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విద్య వైద్యం సాగునీటి ప్రాజెక్టులు పారిశ్రామిక రంగాలలో తెలంగాణలో చిన్న చూపు చూసిన రాహుల్ గాంధీ ఏం చేశారని ఆమె నిలదీశారు. పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత సమస్యలపై స్పందించండి రాహుల్ గాంధీ ఇప్పుడు ఎన్నికల కోసం ఎందుకు వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో రాహుల్ గాంధీకి స్థానం లేదని అన్నారు. తెలంగాణకు రాహుల్ గాంధీ ఓ టూరిస్ట్‌గా రావచ్చని అన్ని చూసి వెళ్ళవచ్చని ఇక్కడ వాతావరణం మాత్రం చెడగొట్టవద్దన్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు మైండ్ బ్లాక్ అయిందని అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొదలుకొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు ఇదే జిల్లాకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ ఇక్కడి పచ్చని పొలాలు పంట కాలువలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని టూరిస్ట్‌గా చూసి వెళ్ళవచ్చు అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుని రాహుల్ గాంధీ తాత నెహ్రు కట్టారని 2017లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం తప్ప ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. పట్టుపడితే ఏ ప్రాజెక్టునైనా పూర్తి చేయడం తమ లక్షమని అందుకు నిదర్శనం మూడున్నర ఏళ్లలో కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. బిఆర్‌ఎస్ కాదు అని బిసిల ప్రభుత్వం అని గుర్తు చేశారు. సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆయన సతీమణి అయేషా ఫాతిమా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజితయాదవ్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News